‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనేది తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమం. రాష్ట్రంలోని ప్రజలందరినీ చైతన్యపరిచేందుకు నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమం. ఇందులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకుని, వాటన్నింటినీ ప్రోదిచేసి, పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం జరుగుతోంది. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపడుతున్నదే కావొచ్చు గాక.. కానీ.. వైసీపీ పార్టీకి చెందిన సర్పంచి కూడా తెలుగుదేశం నాయకుల పలకరింపుతో బోరుమని విలపిస్తూ.. తనకు పట్టిన ఖర్మ గురించి చెప్పుకోవడమే తమాషా. పనిలో పనిగా.. వైసీపీ దళాలు తమకు పట్టిన ఖర్మ గురించి.. పోలీసు స్టేషను సాక్షిగా గొల్లు మంటుండడం కూడా జరుగుతోంది.
రెండు సంఘటనలను గమనిస్తే ఇదేం ఖర్మరా భగవంతుడా అని విలపిస్తున్నారని మనకు అర్థమవుతుంది.
సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేక వర్గం కూడా ఉంది. ఎమ్మెల్యే అవినీతి బాగోతాలు పార్టీ పరువు తీస్తున్నాయని, ఆ వ్యతిరేకవర్గం సందర్భం వచ్చినప్పుడెల్లా ఆరోపిస్తోంది. ఇటీవలి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో కూడా వర్గాల కుమ్ములాటలు బయటపడడం.. ఆయన వారించినా పట్టించుకోకపోవడం, ఆయన అలిగి మధ్యలో వెళ్లిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి సమీక్షసమావేశం మళ్లీ పెద్దిరెడ్డి నేతృత్వంలోనే జరగబోతోంది.
ఎమ్మెల్యే వ్యతిరేక వర్గనాయకులు సమావేశంలో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండాలనేది పార్టీ నాయకుల కోరిక. అలాంటప్పుడు ఏం చేయాలి. పెద్ద నాయకులు వారితో మాట్లాడాలి. సమావేశం జరిగేప్పుడు రచ్చచేయవద్దని చెప్పాలి. కానీ మడకశిరలో ఏం జరిగిందంటే.. ఈ అసమ్మతి నాయకులు అందరినీ పోలీసులు పిలిపించారు. నియోజకవర్గ సమీక్ష సమావేశంలో రచ్చ చేయకూడదని, సామరస్యంగా వ్యవహరించాలని పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి హితోపదేశం చేశారు. సొంత పార్టీ నాయకులను నోరెత్తితే ఖబడ్దార్ అన్నట్టుగా పోలీసులతో బెదిరించడం ఏమిటో అర్థం కావడం లేదని, వారు వాపోతున్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి అవినీతి పార్టీ పరువు తీస్తోందని, ఆ సంగతి చెప్పాలని ఉన్నదే తప్ప.. మరేం కాదని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి మరీ సొంత పార్టీ వాళ్లకు పోలీసులతో వార్నింగ్ ఇప్పించేంతగా ఎందుకు తయారయ్యారో బోధపడడం లేదు.
రెండో ఉదాహరణ కూడా ఇదే సత్యసాయి జిల్లాకు చెందినదే..
గాండ్లపెంట మండలం కురుమామిడి పంచాయతీ సర్పంచి సుధాకర్ వైఎస్సార్ సీపీ నాయకుడే. కానీ.. తెలుగుదేశం నాయకులు ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో తనను పలకరించగానే బోరుమన్నాడు. గత ప్రభుత్వంలో కూడా తాను సర్పించిగా గెలిచానని, టీడీపీ ప్రభుత్వం నిధులు పద్ధతిగానే విడుదల చేసిందని.. ఇప్పుడు వైసీపీ సర్పంచిగా గెలిచినా కూడా.. ప్రయోజనం లేదని అన్నారు. పంచాయతీలకు వచ్చిన నిధులన్నీ ప్రబుత్వం తీసేసుకుంటున్నదని వాపోయారు. 18 లక్షలు సొంత డబ్బు ఇప్పటికే ఖర్చుపెట్టి పనులు చేయించానని, రెండు ప్లాట్లు అమ్మానని, ఆ డబ్బుకు కూడా దిక్కులేదని ఆయన విలపించడం విశేషం.
ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే.. జగన్ పాలనలో సామాన్యులు, ప్రతిపక్షాలకు చెందిన వారు ఇబ్బంది పడడమే కాదు.. సొంత పార్టీ వారు కూడా బోరుమంటున్నారని మనకు అర్థమవుతుంది.