తెలంగాణపై ఫోకస్ తో బిజెపికి హెచ్చరికలు పంపుతున్న చంద్రబాబు!

Friday, March 29, 2024

ఏపీలో బిజెపికి నోటా కన్నా తక్కువగా ఓట్లున్నా, వైఎస్ జగన్ ప్రభుత్వం దౌర్జన్యాలను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి అండగా ఉంటుందనే ఉద్దేశ్యంతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి బిజెపికి దగ్గర కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే తమకు ఏదో రూపంలో ప్రమాదకారి కాగలదని భయం బిజెపిని వెంటాడుతున్నది. 

అందుకనే జగన్ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఆడుకొంటూ వస్తున్నది. 2019లో బిజెపి క్షేత్రస్థాయిలో అందించిన సహకారం వల్లననే వైసిపి 151 సీట్లు గెల్చుకొన్నాదని భావిస్తున్న చంద్రబాబు ఆ రెండు పార్టీల మధ్య బంధం తెంచేందుకు ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. 

ఏపీలో తాము ఒక్క సీటు కూడా గెల్చుకోలేమని నిర్ధారణకు వచ్చిన బిజెపి తెలంగాణ పైననే దృష్టి సారిస్తోంది. ఇక్కడ కేసీఆర్ ను ఎదుర్కొని అధికారంలోకి రావడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. అందుకనే, తెలంగాణాలో టిడిపి రాజకీయంగా ఉనికి కోల్పోయినా చెప్పుకోదగిన ఓట్లున్నాయని చంద్రబాబు భరోసాతో ఉన్నారు. 

కొన్ని జిల్లాలో దృష్టి సారించి,  బలప్రదర్శన చేయడం ద్వారా ఏపీలో జగన్ తో బంధం తెంచుకొంటే, తెలంగాణాలో మద్దతు ఇవ్వడానికి సిద్ధం అనే షరతు విధించడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. 2018 ఎన్నికలలో టిడిపి, కాంగ్రెస్స్ కలవడంతో కేసీఆర్ `తెలంగాణ సెంటిమెంట్’ ప్రయోగించి టీడీపీని చిత్తు చిత్తు చేశారు. కాంగ్రెస్ తో కలవడం ఇష్టంలేని టిడిపి ఓటర్లు సహితం టిఆర్ఎస్ కు వేశారు. అందుకనే ఆ పార్టీకి పెద్దగా బలం లేని జంట నగరాలలో సహితం చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. 

2018లో టిడిపికి 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 8 శాతం వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఓట్లు తెలంగాణ రాజకీయాలను తలకిందులు చేసేందుకు ఉపయోగిస్తాయి. అందుకనే ఉమ్మడి ఖమ్మం జిల్లా, జంట నగరాలపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మొదటగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఆ తర్వాత హైదరాబాద్ లో సహితం బల ప్రదర్శన జరిపే అవకాశం ఉంది. మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ మాజీ ఎంపీ బి నర్సయ్య గౌడను పార్టీలోకి చేర్చుకొని, తమ అభ్యర్థిగా నిలబెట్టాలని టిడిపి నిర్ణయించింది. ఆ విధంగా చేస్తే టిఆర్ఎస్ ఏకపక్షంగా గెలుస్తుందనే భయంతో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నేరుగా చంద్రబాబును సంప్రదించినట్లు తెలిసింది. 

రాజగోపాల్ రెడ్డి అభ్యర్ధన మేరకు టిడిపి పోటీకి దూరంగా ఉండటంతో నరసయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణాలో సుమారు 40 నియోజకవర్గాలలో టిడిపికి చెప్పుకోదగిన ఓటర్లు ఉన్నారని భావిస్తున్నారు. ఆ ఓటర్లు అందరు బిజెపి పట్ల ఆగ్రహంతో  ఉండడంతో, వారంతా దాదాపుగా 2018లో టిఆర్ఎస్ కు ఓట్ వేశారు. బిజెపి ఒక సీట్ మాత్రమే గెల్చుకుంది. 

వీరినే `సీమాంధ్ర ఓటర్లు’ అని పిలుస్తూ, వారిని ఆకట్టుకోవడం కోసం బిజెపి వ్యూహకర్తలు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మద్దతు లేకుండా తెలంగాణాలో తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్ధకరంగా కాగలదని బిజెపి కేంద్ర నాయకులు గ్రహించారు. 

`సీమాంధ్రులు’ ఎవ్వరికీ తెలంగాణ బీజేపీలో ఎటువంటి ప్రాధాన్యత లేదనే విషయాన్నీ సహితం రాష్ట్ర ఇన్ ఛార్జ్ గా వచ్చిన సునీల్ భన్సాలీ కేంద్ర నాయకత్వానికి నివేదించినట్లు తెలుస్తున్నది. ఇటువంటి సమయంలో టిడిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను పోటీకి దింపితే ఎక్కువగా నష్టపోయెడిది బిజెపి మాత్రమే కాగలదు. అందుకనే తనతో అవగాహనకు రాక తప్పని పరిస్థితులను బిజెపి నాయకత్వానికి కలిగించే ఎత్తుగడలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles