టీబీజేపీకి షాక్ ఇవ్వనున్న పవన్ కల్యాణ్!

Thursday, May 2, 2024

మేం ఒంటరిగానే పోటీచేస్తాం.. జనసేనతో బిజెపితో పొత్తులు అనేవి కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం అంటూ టీబీజేపీ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతుంటుంది. కరెక్టుగా చెప్పాలంటే చులకన చేస్తుంటుంది. ఆయనతో మైత్రి మాకు అనవసరం.. తెలంగాణలో ఆయనకున్న బలం సున్నా.. అనే సంకేతాలు ఇస్తూ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో తెలంగాణలో జనసేనకు బలం ఉన్నదో లేదో ఎన్నికల క్షేత్రంలోనే తేల్చుకోవాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోజనసేనకూడా తెలంగాణలో తమకు ప్రాబల్యం ఉన్న 32 నియోజకవర్గాల్లో పోటీచేయడానికి పూనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింతగా చీలిపోయి.. ఆయా నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థుల అవకాశాలకు గండిపడే ప్రమాదం కూడా ఉంటుంది. 

బిజెపి సారథ్యంలోని ఎన్డీయేలో జనసేన కూడా భాగస్వామి పార్టీనే. సాధారణంగా భాగస్వామి పార్టీ అంటే వారి అస్తిత్వం ఉన్న అన్నిచోట్ల కలిసి పోటీ చేయాలి. జనసేన విషయానికి వచ్చేసరికి బిజెపి రెండు నాలుకల ధోరణి పాటిస్తుంది. ఏపీలో పొత్తుల్లో కలిసి పోటీచేస్తున్నాం అని ప్రకటిస్తుంది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి పొత్తులు లేవు.. ఆయన వేరు – మేం వేరు అంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో అనన్యసామాన్యమైన అభిమానుల ఫాలోయింగ్ ఉన్న హీరోగా.. పవన్ కల్యాణ్ కు తెలంగాణలో కూడా చెప్పుకోదగ్గ బలం ఉంది. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు.. జనం వెల్లువ ఎలా ఉన్నదో అందరూ గమనించారు. అయినా సరే.. పవన్ తో పొత్తు పెట్టుకుంటే.. ఆయన అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుందనే స్వార్థంతో.. తాము ఒంటరిగానే రాష్ట్రమంతా పోటీచేసి నెగ్గగలం అనే అహంకారంతో బిజెపి మాత్రం తెలంగాణలో ఆయనను ఖాతరు చేయకుండా ముందుకు సాగుతుంటుంది. 

పవన్ కల్యాణ్.. బిజెపి తో పొత్తులు ఉన్నాయి గనుక.. తనను నమ్ముకున్న తెలంగాణ శ్రేణులకు అన్యాయం చేయలేరు గనుక.. వారి కోసం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ టీ-నాయకులు 32 నియోజకవర్గాలను ఎంపిక చేసి అక్కడ కన్వీనర్లను నియమించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి.. పార్టీ తరఫున ఎవరు పోటీచేస్తే బాగుంటుందో అధ్యయనం చేస్తున్నారు. సో, 32 నియోజకవర్గాల్లో జనసేన పోటీ పక్కా. 119 స్థానాల తెలంగాణలో 32 చోట్ల పోటీ చిన్నవిషయం కాదు.ఈ 32 చోట్ల జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటును గణనీయంగా చీల్చడం కూడా పక్కా. వారు ఓట్లు చీలిస్తే నష్టం జరిగేది బిజెపికే. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారం అనుకుంటున్న బిజెపికి.. 32 చోట్ల దెబ్బ పడిందంటే కోలుకోవడం కష్టం. మరి.. ఆ రూపేణా పవన్ కల్యాణ్ టీబీజేపీ అహంకారానికి షాక్ ఇవ్వబోతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles