30న కాంగ్రెస్ లోకి పొంగులేటి… ప్రియాంకతో మాటా మంతి!

Friday, November 15, 2024

బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన అనంతరం రాజకీయ భవిష్యత్ గురించి భిన్నమైన సంకేతాలు ఇస్తూ వస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకున్న అనంతరం వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 30న ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యాను.

అంతకు ముందు 22న ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమావేశమై ఈ అంశాలపై చర్చించారు. తర్వాత, వీరిద్దరూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో జూమ్ కాల్ లో మాట్లాడారు. పొంగులేటి చేరికపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

ఇక, తర్వాత పాలమూరులో జరిగే సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈనెల 21న దిల్లీకి తిరిగి వస్తారు. ఆరోజునే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

 పొంగులేటి, జూపల్లి కృష్ణారావు చేరిక సందర్భంగా ఖమ్మం, పాలమూరులలో  కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొంగులేటి తన అనుచర వర్గంతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు.

జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్ తదితరులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు కీలక సమాచారం. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పొంగులేటి వెంటే కాంగ్రెస్ లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.

ఏదేమైనా కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికల పైననే దృష్టి సారిస్తున్నారు. బిఆర్ఎస్, బిజెపిలలోని అసంతృప్తి నేతలను గుర్తించి, వారిని సంప్రదించడం, కాంగ్రెస్ పెద్దల నుండి అవసరమైతే హామీలు ఇప్పించడం చేస్తున్నారు.
మరోవంక, కాంగ్రెస్ లో నిత్యం అసంతృప్తి నేతగా ప్రసిద్ధి చెంది, ఎవ్వరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇబ్బందులు కలుగచేస్తూ వస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహితం శుక్రవారం ప్రియాంక గాంధీని కలిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు అందరూ కలిసి పనిచేస్తున్నామని చెప్పడం ప్రాధాన్యత అంతరింప చేసుకుంది.

కాంగ్రెస్ నుండి బైటకు వెళ్లిన వారంతా క్రమంగా తిరిగి వస్తున్నారని చెబుతూ బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సహితం తిరిగి రానున్నట్లు సంకేతం ఇవ్వడం బీజేపీ వర్గాలలో కలకలం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానంలో ముఖ్యులు సన్నిహితంగా పర్యవేక్షిస్తూ ఉండడంతో పరిస్థితులలో ఎవ్వరూ ఊహించని మార్పులు వస్తున్నట్లు కనిపిస్తున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles