3 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి… చంద్రబాబు అల్టిమేటం

Thursday, December 19, 2024

72 గంటల్లోగా తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేని పక్షంలో 9న తహశీల్దార్‌ కార్యాలయాలు, 11న కలెక్టర్లకు వినతి పత్రాలు అందించి నిరసన తెలియజేస్తామని మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అప్పటికీ స్పందించకపోతే 13న రిలే దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.

మూడు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తూ పంట నష్టాలను పరిశీలిస్తూ, నష్టాలకు గురైన రైతులను పరామర్శిస్తున్న ఆయన అకాల వర్షాల కారణం దాదాపు 70 నియోజకవర్గాల్లో పంటలకు నష్టం జరిగిందని చెప్పారు. అన్నదాతలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి జగన్ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

సీఎం రాలేదు…మంత్రులు కదలలేదని… రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని… ప్రీమియం చెల్లించలేదని ఆరోపించారు. ‘మా పంట మునిగింది- పరిహారం ఇవ్వండి’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని… రైతులందరూ తమ పంటను వీడియో తీసి పోస్టు చేయాలని కోరారు.

“ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. 40 నుంచి 50 శాతం పంట ఇంకా పొలాల్లో ఉంది. వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం కొన్నారు….మిగిలిన పంట కల్లాల్లోనే ఉంది. నేను వచ్చాను అని ప్రభుత్వం ఇప్పుడు సేకరణ అంటూ అధికారులను పంపుతోంది” అని ధ్వజమెత్తారు.

ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదని, ధాన్యం అకాల వర్షాల భారినపడేది కాదని చెబుతూ నేటి ఈ సమస్యకు పూర్తి కారణం సిఎం జగన్ రెడ్డి మాత్రమే అని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్టు జగన్ వైఖరి ఉందని ధ్వజమెత్తారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నాడని మండిపడ్డారు.

రైతులకు గోనె సంచులు కూడా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం  అంటూ మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. కౌలు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫల మైoదని ఆయన ఆగ్రహo వ్యక్తం చేశారు. ఎకరాకు 30 నుంచి 40 బస్తాలు కౌలిచ్చి పంటలు పండిస్తున్నారని చెబుతూ తొలకరిలోనే భారీ వర్షాలకు పంచ నష్టం ఏర్పడిందని, ఇప్పుడు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరింత నష్టం వాటిని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో ఎఫ్ సి ఐ ఫుడ్ కార్పొరేషన్ సివిల్ సప్లై రైస్ మిల్లర్లు కలిసి కొనుగోలు చేసి రైతులను ఆదుకునే వారిని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు గోన సెంచులు కూడా అవినీతి ఏర్పడిందని నిబంధనలను పేరుతో రైతులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం వెంటనే చేలో ఉండే పంటకు పరిహారం ఇవ్వాలని, ఎంత పరిహారం ఇస్తారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కోసిన పంట వర్షాలకు దెబ్బతింది. వాటిని పూర్తిగా సేకరిస్తారా లేదా చెప్పాలి ? అని ప్రశ్నించారు. ధాన్యం రవాణా ఉచితంగా చేయాలని కోరారు. మిల్లర్లు రైతు దగ్గర ధాన్యం విరిగిపోతుంది అని డబ్బులు వసూలు చేస్తున్నారు.ప్రభుత్వ వైఖరితో ఒక్కో బస్తాపై రైతు రూ. 300 నష్టపోతున్నాడని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో వరితో పాటు మొక్కజోన్న, వాణిజ్య పంటలకు నష్టం జరిగింది. వాణిజ్య పంటలకు సాగుపెట్టుబడి లక్ష రూపాయలు అవుతుందని చెబుతూ వారికి జరిగిన నష్టాన్ని ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పటిలోపు ఈ ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలని, వర్షాలకు నష్టపోయిన రైతులకు ఏం సాయం చేస్తారో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles