తెలంగాణాలో ఈటెల- పొంగులేటి సరికొత్త రాజకీయం!

Tuesday, April 16, 2024

బిఆర్ఎస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో గతంలో బిఆర్ఎస్ లో కీలక నేత, ప్రస్తుతం బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ రెండురోజుల క్రితం ఖమ్మంలో జరిపిన భేటీ తెలంగాణ రాజకీయాలలో సరికొత్త ఎత్తుగడలకు నాందిగా పలువురు భావిస్తున్నారు. పొంగులేటిని బీజేపీలో చేరమని ఆహ్వానించేందుకు బిజెపి చేరికల కమిటీ చైర్మన్ గా కమిటీ సభ్యులు అందరితో కలిసి వెళ్లి కలిసారని పైకి చెబుతున్నప్పటికీ అసలు రాజకీయం వేరేగా ఉండనే కధనాలు వెలువడుతున్నాయి.

విద్యార్థి ఉద్యమాల నుండి తెలంగాణ ఉద్యమం వరకు క్రియాశీలకంగా వ్యవహరించిన ఈటెల టీఆర్ఎస్ ను రాజకీయ వ్యూహాలతో సహితం కీలక భూమిక వహించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో గెలువపండాగానే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవో, మరొక ముఖ్యమైన పదవో అప్పచెప్పి తెలంగాణాలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతలు అప్పచెబుతారని అమిత్ షా నుండి కీలకనాయకులు పలువురు ఆయనకు భరోసా ఇచ్చారు.

అయితే, ఆ తర్వాత కాలంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుండి అవమానాలు ఎదురవుతూ రావడం, పార్టీ అగ్రనాయకత్వం కూడా పట్టించుకోకపోవడంతో కొంతకాలం మౌనంగా ఉండిపోయారు.  అయితే బీజేపీలో క్షేత్రస్థాయిలో రాజకీయానుభవం గలవారెవరూ లేరని, తనకు మౌనంగా ఉండటం భావ్యం కాదని, తనదైన ఎత్తుగడలతో తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేందుకు రంగంలోకి దిగాలని మద్దతుదారుల నుండి వత్తిడులు వస్తుండడంతో తిరిగి ఈ మధ్య క్రియాశీలకంగా కనిపిస్తున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నుండి బీజేపీలో చేరిన పలువురు నేతలు సహితం ఇటువంటి అసంతృప్తితోనే ఉన్నారని గ్రహించి, అందరం కలిసి సమిష్టిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణకు దిగాలని నిర్ణయానికి వచ్చారని తెలుస్తున్నది. ఈ ఎత్తుగడలో భాగంగానే కనీసం బండి సంజయ్ కు సమాచారం కూడా లేకుండా తన కమిటీ సభ్యులతో ఈటెల ఖమ్మం వెళ్ళి పొంగులేటితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సుదీర్ఘ భేటీ జరిపారు.

ఈటెల ఖమ్మం భేటీ గురించి మీడియా అడిగితే బండి సంజయ్ తెల్లమొఖం వేయాల్సి వచ్చింది. తనకు సమాచారం లేదని అంగీకరించారు. మరోవంక, పార్టీ అగ్రనేతలైన అమిత్ షా, జెపి నడ్డాల ఆదేశం మేరకు వచ్చానని అంటూ ఖమ్మంలో ఈటెల చెప్పడం గమనార్హం.

వీరంతా కలిసి తెలంగాణాలో తమకున్న సంబంధాలను బట్టి సుమారు 50 నియోజకవర్గాలను ఎంపిక చేసి, అక్కడ బిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించి, తమకు సంబంధించిన వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 40 మంది ఎమ్యెల్యేను గెలిపించుకొంటే ముఖ్యమంత్రి పదవి తమదే అవుతుందనే భరోసాతో ఉన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి అధికారంలోకి రావడం అసాధ్యమని, 40కు మించి నియోజకవర్గాలలో కనీసం బలమైన అభ్యర్థులను నిలబెట్టలేదని ఈటెల సహితం నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. పొంగులేటి, జూపల్లి కలిసివస్తే వారిద్దరూ కనీసం 15 నియోజకవర్గాలలో ప్రభావం చూపగలరని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు బిజెపితో కలిసి ప్రయాణం చేయడమా, మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయడమా .. అనే విషయమై కర్ణాటక ఎన్నికల ఫలితాలను బట్టి వీరు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల తెలంగాణ రైతు సమాఖ్య (టిఆర్ఎస్) పేరుతో ఎన్నికల కమిషన్ వద్ద ఒక పార్టీ రిజిస్టర్ అయింది. ఆ పార్టీని పొంగులేటి అనుచరులే రిజిస్టర్ చేయించారనే ప్రచారం జరుగుతుంది.

సీఎం కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న పొంగులేటి వివిధ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బలమైన నేతలను నియోజకవర్గాల వారీగా గుర్తించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ నాయకులను గుర్తించి వారికి బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles