ఏపీలో ఎన్నికల వాతావరణం అప్పుడే నెలకొంటుంది. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని తలపించే రీతిలో విస్తృతంగా ప్రజల మధ్యకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వంక ఎన్నికల పొత్తులు, అభ్యర్థుల ఎంపికల అంశం ఖరారు కాకుండానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలలోకి వెళ్లినందుకు `వరాహ’ వాహనంలో యాత్రను `వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’ లక్ష్యంగా చేపట్టారు.
ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నట్టు కధనాలు వెలువడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సినిమాలను కూడా పక్కనపెట్టి క్షేత్రస్థాయిలో ఇక నుండి ఎక్కువగా ఉండేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈనెల 14 నుంచి ఈ యాత్ర రోడ్డెక్కుతుందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైందని తెలిపారు. తొలి విడతగా తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు.
అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. ప్రారంభ యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకు సాగుతుందని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వమంటూ చెబుతూ వస్తున్న పవన్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
తొలివిడత పార్టీకి బాగా పట్టు ఉందనుకొంటున్న ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం జోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్ లోసాగనుంది. యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకు పోతామని వెల్లడించారు.
జనసేన ద్వారా ప్రజలకు భరోసా కల్పించేలా యాత్ర ఉంటుందని నాదెండ్ల వివరించారు. జనసేన యాత్రతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని చెబుతూ క్షేత్ర స్థాయిలో సమస్యలను ప్రస్తావించేలా కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల ప్రచారం కోసం వారాహి వాహనాన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన సంగతి తెలిసందే. ఆరు వ్యక్తిగత వాహనాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించారు. వీటితో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారు పవన్ కల్యాణ్. ఆయా వాహనాల్లో ఒకటి బెంజ్, టయోటా వెల్‌ఫైర్, 2 స్కార్పియోలు, జీప్, ఒక గూడ్స్ వెహికల్ ఉన్నాయి. ఈ వాహనాలన్నీ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయి.
ఇక వారాహిలో ప్రత్యేకమైన లైటింగ్, ఆధునిక సౌండ్ సిస్టమ్స్ .ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత భద్రతా చర్యలతో వాహనం రూపొందించారు. పవన్‌కల్యాణ్ పర్యటనల సందర్భంగా లైట్లు ఆఫ్ చేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో వాహనంలో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వారాహిలో అన్ని వైపులా సీసీ కెమెరాలు ఉన్నాయి. అది ఎప్పటికప్పుడు సర్వర్ రూమ్‌కి వెళుతుంది. ఆధునిక సౌండ్ సిస్టమ్‌తో వేలాది మంది ప్రజలు కూడా పవన్ కల్యాణ్ ప్రసంగాలను స్పష్టంగా వినవచ్చు.