హరిరామ జోగయ్య డెడ్‌లైన్ తో ఇరకాటంలో ముద్రగడ 

Sunday, December 22, 2024

కాపు రిజర్వేషన్ల అమలుపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య వైఎస్ జగన్ ప్రభుత్వంకు  డెడ్‌లైన్ విధించడంతో కాపులకు తానే ప్రతినిధి అని చెప్పుకొనే మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. 

కాపులకు 5 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, అందుకు డిసెంబర్ 30వ తేదీ వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టైం ఇస్తున్నామని చేగొండి ప్రకటించారు. అప్పటిలోపు కాపు రిజర్వేషన్ల అమలుపై స్పష్టత ఇవ్వకపోతే జనవరి 2వ తేదీ నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు 5 శాతం రేజర్వేషన్లు  కల్పిస్తూ చట్టం తీసుకొచ్చినా, ఈ విషయమై ఆయన ప్రభుత్వంపై తరచూ విమర్శలకు దిగుతుండే ముద్రగడ, ఆందోళనలకు కూడా దిగారు. తునిలో జరిపిన కాపు సదస్సు విధ్వసంకు దారితీసినా ఎటువంటి బాధ్యత వహించలేదు. 

అయితే, 2014, 2019 ఎన్నికల మానిఫెస్టోలలో కాపు రిజర్వేషన్ గురించి హామీ ఇచ్చిన వై ఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆ అంశాన్ని పక్కకు నెట్టేసినా ముద్రగడ నోరు మెదపడం లేదు.  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు అసెంబ్లీలో చేసిన బిల్లు చట్టబద్ధమేనని కేంద్ర ప్రభుత్వంపార్లమెంట్ లో స్పష్టం చేసిన తర్వాత నాలుగు రోజులు ఆగి  రేజర్వేషన్లు అమలు పరచమని ముఖ్యమంత్రి జగన్ కు ఓ  లేఖ మాత్రం వ్రాసారు. 

వైసిపిలో చేర్చుకొని, వచ్చే ఎన్నికలలో అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోటీ చేయించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి. అందుకనే ముద్రగడ ఏనాడు జగన్ ప్రభుత్వ విధానాలపై కఠినంగా స్పందించలేదు.ఇప్పుడు, తాను ప్రాణత్యాగం చేసి అయినా కాపులకు రిజర్వేషన్లు సాధించుకుని తీరతానని హరిరామజోగయ్య స్పష్టం చేయడంతో ముద్రగడ ఇబ్బందికి గురవుతున్నట్లు తెలుస్తున్నది. 

అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాపుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న జగన్ కాపు  కార్పొరేషన్ నిధులకు సహితం గండి కొట్టారు. బిసి కులాలను సమీకరించుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయమై ఆగ్రవేశాలతో ఉన్న కాపులను శాంతి పరచడం కోసమే ముద్రగడ జగన్ కు ఓ లేఖ రాసినట్లు భావిస్తున్నారు. 

కానీ, ఇప్పుడు హరిరామజోగయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించడంతో మరోసారి కాపుల సమస్య రాజకీయంగా కాకపుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ముద్రగడ కాపులతో ఉంటారా? లేదా జగన్ ను ఆదుకొనే ప్రయత్నాలు కొనసాగిస్తారా? చూడవలసి ఉంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles