హనుమంతుడి ముందు పనిచేయని కర్ణాటక బిజెపి కుప్పిగంతులు

Wednesday, January 22, 2025

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తున్న కర్ణాటక ఎన్నికలలో బిజెపికి చావుదెబ్బ తగిలింది. దక్షిణాదిన విస్తరించాలనే ప్రయత్నాలకు ఉన్న ఒక్క రాష్ట్రం కూడా ఓడిపోవడంతో గండిపడినట్లయింది. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రధాని కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయినంత విస్తృతంగా నరేంద్ర మోదీ కర్ణాటకలో ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.

రాజకీయ అంశాలను, తమ ప్రభుత్వ పరిపాలన అంశాలను పక్కన పెట్టి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో బజరంగ్ దళ్ గురించి ప్రస్తావించడాన్ని సాకుగా తీసుకొని `భజరంగ్ బలి’ అంటూ ఓటు వేయమని, దేవాలయాల వద్ద హనుమాన్ సాలిసా పఠించమని స్వయంగా ప్రధాని ప్రచారం చేశారు. హనుమంతుడి పేరుతో తమ ప్రభుత్వ వైఫల్యాల నుండి, అవినీతి ఆరోపణల నుండి ప్రజల దృష్టి మళ్లించే ప్రధాని ప్రయత్నాలు వికటించాయి.

 మే 3న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు బహిరంగ సభల్లోనూ.. ప్రధాని మోదీ  ‘జై బజరంగ్ బలి’ నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో  బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సైతం ఆందోళనలు చేశాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ముట్టడించి, నిరసనలు తెలిపాయి.

భజరంగ దళ్ గట్టెక్కిస్తుందని భావించినా ఓటర్లు మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆంజనేయస్వామి కూడా బీజేపీని కాపాడలేకపోయాడంటూ కాంగ్రెస్ సంతోషంతో సంబరాలు మొదలు పెట్టింది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ విజయానికి గుర్తుగా కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద జై బజరంగ్ బలి అంటూ నినాదాలు చేస్తూ విక్టరీని ఎంజాయ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత  ప్రియాంక గాంధీ సహితం శనివారం హిమాచల్ ప్రదేశ్ లో హనుమాన్ ఆలయం సందర్శించడం గమనార్హం.

కాంగ్రెస్ అంచనాలకు మించి విజయం సాధించింది. 224 నియోజకవర్గాల్లో 135కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. విశేషమేమిటంటే.. కర్ణాటకలో గతేడాది కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర జరిగిన చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కర్ణాటకలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏడు జిల్లాల్లో మొత్తం 51 నియోజకవర్గాలలో జరిగింది.

వాటిల్లో 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం చెప్పుకోదగిన విషయం. చామరాజనగర్‌లోని 4 నియోజకవర్గాల్లో 3, మైసూర్‌లోని 11 నియోజకవర్గాల్లో 8, మాండ్యలోని 7 నియోజకవర్గాల్లో 5, చిత్రదుర్గలోని 6 నియోజకవర్గాల్లో 5, బళ్లారిలో 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రాయచూర్‌లోని ఏడింటిలో కాంగ్రెస్ నాల్గింటిని గెలుచుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగుపరచడంలో భారత్ జోడో యాత్ర కీలకపాత్ర పోషించినట్లు జైరాం రమేష్ చెప్పారు. జోడో యాత్ర సంజీవనిలా పనిచేసిందని, పార్టీ కార్యకర్తలు, నాయకులలో ఐక్యతను, సంఘీభావాన్ని పెంపొందించిందని ఆయన చెప్పారు.

ప్రజలు కాంగ్రెస్‌కు ఎదురు లేని మద్దతు ఇవ్వడంతో బీజేపీ పెద్దలు కలవరపడుతున్నారు. బీజేపీ మంత్రులు బీసీ పాటిల్, గోవింద కరజోల, డాక్టర్ కే సుధాకర్, ఎంటీబీ నాగరాజు, బీ శ్రీరాములు, నారాయణ గౌడ, మురుగేశ్ నిరానీ ఓటమిపాలవడంతో, రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావంతో పొరుగున ఉన్న మహారాష్ట్రాలో సహితం పార్టీ వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలపై ఆశలు వదులుకోవాల్సిందే అని భావిస్తున్నారు.

కర్ణాటకలో కౌంటింగ్ ప్రారంభించినప్పటి నుంచి మొదటి రెండు గంటలూ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొనగా, క్రమంగా కాంగ్రెస్ మెజారిటీ మార్క్ దిశగా దుసుకుపోయింది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటగానే గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా నేతలు, కార్యకర్తలు, వీరాభిమానులు స్వీట్లు పంచుకుని, బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. శాసనసభా పక్ష సమావేశం ఆదివారంనాడు ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles