రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి సమీకరించిన భూముల్లో స్థానికేతరులకు నివాస స్థలాలను కేటాయించడంపై రైతుల అభ్యంతరాలను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో రైతులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం కోర్టు ప్రారంభమైన వెంటనే రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై వెంటనే విచారన చేయాలని సీజేఐ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
ఈ వ్యవహారంపై వచ్చే వారం విచారణ జరుపుతామని సీజేఐ ప్రకటించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కట్టా రాజేంద్రవరప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరున ఈ పిటిషన్ దాఖలైంది. దీన్ని వెంటనే విచారణకు స్వీకరించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాదులు మెన్షన్ చేశారు.
రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి అన్ని జిల్లాలవారికి ఇళ్ళస్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ప్రాంతం ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణానికి కేటాయించారని, ప్రభుత్వ జీవోను నిలిపేయాలని రైతులు పిటిషన్ వేశారు.
అయితే పిటిషన్ నిలిపివేయడానికి నిరాకరిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని రాజధాని రైతులు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను ఒప్పందానికి విరుద్ధంగా కేటాయించడంపై స్టే విధించాలని కోరారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చామని, రాజధానిలో జరిగే నిర్మాణాల కోసమే ఆ స్థలాలను వినియోగించాలికానీ పేదలకు ఇళ్ల స్థలాల కింద ఎలా ఇస్తారంటూ అమరావతి రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే పేదలకు 35 శాతం ఇళ్ళస్థలాలివ్వాలంటూ సీఆర్డీయే చట్టంలోనే ఉందని, కానీ వైసీపీ ప్రభుత్వం 5 శాతమే ఇచ్చిందని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది తన వాదనలను వినిపించారు.
పేదలకు ఇళ్ళ స్థలాలివ్వడంలో తప్పు లేదని, కోర్టు కూడా అన్ని వర్గాల ప్రజలు రాజధానిలో ఉండాలంటోందనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.మరోవైపు రాజధానిలో పేదలకు ఇళ్ల స‌్థలాల కేటాయింపుపై ఉన్న అడ్డంకులు తొలగిపోవలడంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వారికి ఇళ్ల పట్టాలు అందించి స్థలాలను కేటాయించనున్నారు.
మొత్తం 20,684 మంది లబ్దిదారులకు పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. లబ్దిదారులకు ఇప్పటికే భూకేటాయింపు పత్రాలు ఇచ్చామని, 20,684మందికి ఫ్లాట్ డెవలప్‌మెంట్‌తో పాటు ఇంటి పట్టాలను అందచేయనున్నామని తెలిపారు. విజయవాడ నగరానికి చెందిన మూడు నియోజక వర్గాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాలు అందించనున్నట్లు తెలిపారు.
రాజధాని ప్రాంతంలో 570 ఎకరాలను లబ్దిదారుల ఇళ్ల స్థలాలకు కేటాయించనున్నట్లు చెప్పారు. నంబరింగ్ అయిన తర్వాత అంతర్గత రోడ్ల నిర్మాణం చేపడతామని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. గతంలో జిల్లాకు చెందిన 24వేల మంది లబ్దిదారులు నమోదైనా రీఎగ్జామిన్‌లో దాదాపు ఐదు వేల మంది అచూకీ దొరకలేదని, అదనంగా మరో 95 ఎకరాలను కూడా కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు. 18వ తేదీ నాటికి ఆర్ 5 జోన్‌లో ఇళ్ల స్థలాల కేటాయింపు పూర్తి చేస్తామని ప్రకటించారు.