ఆదివారం అట్టహాసంగా జరిగిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ కి మధ్య మరో వివాదం రాజుకుంది.
కొత్త సచివాలయ ప్రారంభోత్సవ ఆహ్వానంపై రగడ నెలకొంది. ప్రభుత్వం నుంచి ఆహ్వానం రాకపోవడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని రాజ్ భవన్ ప్రకటించింది. ఈ మేరకు రాజ్ భవన్ ఓ నోట్ విడుదల చేసింది.
ఆహ్వానం పంపామని రాష్ట్ర ప్రభుత్వం అనడం తప్పు అని, గవర్నర్‌కు అసలు ఆహ్వానం ఇవ్వలేదని తెలిపింది. ఆహ్వానం రాకే గవర్నర్ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాజ్‌భవన్ మంగళవారం ఓ నోట్ విడుదల చేసింది. సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం పంపినా కూడా గవర్నర్ హాజరు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని గవర్నర్ తిప్పికొట్టారు.
కొత్త సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆహ్వానం రానందున గవర్నర్ హాజురు కాలేదని రాజ్ భవన్ వర్గాలు ప్రకటించాయి. ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 2500 మందికి ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది.
అయితే గవర్నర్ కు మాత్రం ఎలాంటి ఆహ్వానం రాలేదని రాజ్ భవన్ వర్గాలు తేల్చి చెప్పాయి. ప్రభుత్వం నుండి ఆహ్వానం రానందువల్లే ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని ప్రకటనలో చెప్పారు. నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ హాజరు కాకపోవడంపై మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం చేసిన ప్రకటన ఈ వివాదాన్ని రాజేసింది.
గవర్నర్ సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. గవర్నర్ రాకపోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదని, దీని వల్ల గవర్నర్ నిజస్వరూపం బయటపడిందని ఆరోపించారు.
పైగా, తెలంగాణ అభివృద్దిని చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారని, గవర్నర్ రాకపోవడం కూడా అందులో భాగమేనని అంటూ దారుణంగా విమర్శలు చేశారు. నూతన సచివాలయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకని.. సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు.
అంతటితో ఆగకుండా, అభివృద్ధికి అడ్డుపడే వారికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరిక చేశారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని రాజ్‌భవన్ వర్గాలు స్పందించడం గమనార్హం. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య ఎప్పటినుంచో విమర్శల యుద్దం కొనసాగుతోంది.
ప్రభుత్వ వైఫల్యాలను గవర్నర్ తప్పుబడుతుండగా, గవర్నర్‌పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు కురిపిస్తున్నాయి. గతంలో మీడియా వేదికగా బహిరంగంగా కేసీఆర్ టార్గెట్‌గా తమిళిసై తీవ్ర విమర్శలు కురిపించడం దుమారం రేపింది. ఇలాంటి నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసైను ఆహ్వానించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రతిపక్ష, విపక్ష పార్టీలు దీనిని తప్పుబడుతున్నాయి. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు పక్షం రోజుల క్రితం జరిగిన డా. అంబెడ్కర్ విగ్రవిష్కరణకు సహితం తనకు ఆహ్వానం లేదని, అందుకే హాజరు కాలేకపోయానని అంటూ గవర్నర్ డా. తమిళసై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె స్వయంగా, సచివాలయం ప్రారంభోత్సవంకు ఆహ్వానం అందితే హాజరు కాగలనని అంటూ చెప్పుకొచ్చారు.