తాను చేపడుతున్న సంక్షేమ పథకాలు, పంచిపెడుతున్న డబ్బులే తనను ఏకపక్షంగా మళ్లీ అధికార పీఠం మీద కూర్చోబెట్టేస్తాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉంటున్నారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికి బయటి వారు ఎవ్వరూ అవసరం లేదని, సొంత పార్టీలో ఉన్న కుమ్ములాటలు మాత్రమే చాలునని అనిపించేలా సంకేతాలు కనిపిస్తున్నాయి. దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ ముఠాకుమ్ములాటలు రోజురోజుకూ బయటపడుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది 151 నియోజకవర్గాల్లో కాగా, ముఠాకుమ్ములాటలతో బజారున పడిన నియోజకవర్గాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. పార్టీ ఖచ్చితంగా దృష్టిసారించి బేరీజు వేస్తే.. యాభైకి పైగా నియోజకవర్గాల్లో సొంతపార్టీలోనే కుంపట్లు రగులుతున్నాయని అర్థమవుతుంది.
ఒకవైపు రామచంద్రపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గీయులు అక్కడి మంత్రి వేణుగోపాలకృష్ణ వెనుక గోతులు తవ్వుతున్న సమయంలోనే.. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే తిప్పేస్వామి మీద తిరుగుబాటు ముసలం తాజాగా మరొకటి పుట్టుకువచ్చింది. ఎమ్మెల్యే తిప్పేస్వామి తన నియోజకవర్గంలో చాలా కాలంనుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు. తాజాగా వైసీపీకే చెందిన ఒక ఎంపీపీ ఎమ్మెల్యే అవినీతి, అరాచకాలు, దందాల గురించి ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేయడం.. చర్చనీయాంశం అవుతోంది.
మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అతిపెద్ద అవినీతి పరుడు అని రొళ్ల మండల ఎంపీపీ కవిత ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, నాడు నేడు పనుల్లో సిమెంటును పెద్దఎత్తున పక్కదారి పట్టించి స్వాహా చేస్తున్నారనేది ఆమె ఆరోపణ. ఎమ్మెల్యే అవినీతిలో భాగం కావాల్సి వస్తుందని.. ఇంజినీర్లు కొందరు బదిలీలపై నియోజకవర్గానికి రావడానికి విముఖత చూపుతున్నారంటూ ఆరోపించారు. ప్రతిపనికీ పది వేల నుంచి లక్షల రూపాయల ముడుపులు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అవినీతిని ప్రశ్నించినందుకు తన భర్త విజయరంగేగౌడ్ మీద అక్రమ కేసులు బనాయించారనేది ఎంపీపీ కవిత ఆవేదన. ఎమ్మెల్యే అనుచరుల వల్ల తమకు ప్రాణహాని ఉన్నదని కూడా ఆమె అంటున్నారు.
సాధారణంగా ఎమ్మెల్యే ల పట్ల అసమ్మతులు ఉంటే.. వాటిని చెప్పుకోడానికి పార్టీలోనే ఇంకొక లెవెల్ వ్యవస్థ ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ లో అది కొరవడినదా అనిపిస్తోంది. ఎందుకంటే.. ప్రతిచోటా చిన్న ఇబ్బంది రాగానే అందరూ రోడ్డున పడి విమర్శలు చేస్తున్నారు. వ్యవహారం బాగా ముదిరిన తర్వాత పెద్దలు జోక్యం చేసుకుంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ సొంత పార్టీ ఎమ్మెల్యేల గుట్టు బయటపెడుతూ పోతే.. ఎన్నికల్లో పార్టీకి ముప్పేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.