విశాఖ రాజధాని కాబోతుందనే జగన్ ప్రకటనపై దుమారం

Wednesday, January 22, 2025

రాష్ట్ర ప్రభుత్వంపు మూడు రాజధానుల ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కొట్టివేయగా, ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండగా, విశాఖపట్నం రాజధాని కాబోతోందని, త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నట్లు ముఖ్మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం దుమారం రేపింది. దిల్లీలోని లీలా ప్యాలెస్‌ హౌటల్‌లో నిర్వహించిన ఎపి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మొదటిసారి ఈ అంశంపై జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు.

”మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నా. విశాఖపట్నం రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి షిఫ్ట్‌ అవుతున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా” అని జగన్‌ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు “ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్” అంటూ ఉచ్చరిస్తూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏకంగా “కాబోయే రాజధాని విశాఖ” అంటూ బహిరంగంగా పేర్కొనడం విచ్ఛిన్నకర ధోరణినే వెల్లడి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఏకగ్రీవ తీర్మానంతో అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉన్నది.

 జగన్మోహన్ రెడ్డి అధికార పీఠం ఎక్కగానే వికేంద్రీకరణ ముసుగులో తెచ్చిన లోపభూయిష్టమైన చట్టాలను తానే భేషరతుగా ఉపసంహరించుకొన్నారు. ఒకసారి తీర్మానం చేసి, అమరావతిని రాజధానిగా చేసిన నేపథ్యంలో మరొకసారి రాజధాని అంశంపై తీర్మానం చేసే శాసనాధికారం శాసనసభకు లేదని హైకోర్టు విస్పష్టమైన, చారిత్రాత్మకమైన తీర్పు కూడా ఇచ్చింది.

విశాఖ రాజధాని అని ప్రకటించి సీఎం జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అని పేర్కొంటూ నర్సాపురం ఎంపీ రామకృష్ణంరాజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ కు ఓ లేఖ వ్రాసారు. రాజధానిపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతన్న సమయంలో సీఎం చేసిన వాఖ్యలు నిబంధనల ప్రకారం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా ఉన్నయానై ఆయన స్పష్టం చేశారు. పైగా, న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకొనేవిధంగా జగన్ వాఖ్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. సీఎం వాఖ్యాలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని ఆయన సిజెఐ కు విజ్ఞప్తి చేశారు.

కాగా ఇదే సమయంలో, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుని ఏప్రిల్‌ లోపే విశాఖ నుంచి పాలన జరుగుతుందని జగన్ బాబాయి, టిటిడి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. విశాఖ నుంచి పాలన కొనసాగించేందుకు సీఎం జగన్‌ కట్టుబడి ఉన్నారని స్పషటం చేస్తూ. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు.

అయితే జగన్‌ ప్రకటనను న్యాయనిపుణులు తప్పుపడుతున్నారు. కోర్టు విచారణలో ఉండగానే విశాఖను రాజధానిగా ఎలా భావిస్తారని ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణ కిందకు వస్తాయని స్పష్టం చేస్తున్నారు. సుప్రీం కోర్టులో అమరావతిపై విచారణ జరుగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అమరావతి రాజధానికి సంబంధించి ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ‘2014 ఆంధ్రప్రదేశ్ పున:ర్విభజన చట్టం ప్రకారం రాజధాని అమరావతిగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేశాక దానిపై మరోసారి తీర్మానం చేసేందుకు లెజిస్టేటివ్ కాంపటెన్సివ్ లేదు’’అని స్పష్టం చేసింది సీఎం జగన్ ప్రకటన హైకోర్టు ధిక్కరణే అవుతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.  పైగా,  సీఎం ప్రకటన హైకోర్టును ధిక్కరించడమే అవుతుందని పయ్యావుల మండిపడ్డారు. విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలున్నాయని ఆరోపించారు.

విశాఖ రాజధాని కాబోతుందంటూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, “నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు” అన్న నానుడిని గుర్తు చేస్తున్నదని సామాజిక ఉద్యమకారుడు టి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.  హైకోర్టు తీర్పును ఖాతరు చేసేదిలేదన్న ధిక్కారస్వరం వినిపించినట్లుగా భావించాలని ఆయన తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంపైన, చట్ట సభలపైన, న్యాయ వ్యవస్థపైన ఏ మాత్రం గౌరవంలేదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై ధ్యాసలేదని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారని ఆయన ధ్వజమెత్తారు.

హైకోర్టు తీర్పుపై ఆరు నెలల పాటు కాలయాపన చేసి సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాఖలు చేసింది. కేసు విచారణలో ఉన్నది. రాజధానిపై చట్టం చేసే శాసనాధికరం శాసన సభకు లేదన్న హైకోర్టు తీర్పు అమలులో ఉన్నది. మరి, రాజధానిని విశాఖకు ఎలా తరలిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు?  అంటూ లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.

కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి తాను స్పందించనని అంటూనే రాజధానిపై ఏం చేసినా చట్టబద్దత ఉండాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హితవు చెప్పారు. జగన్ చేసిన వ్యాఖ్యలు సున్నితమైన అంశమని పేర్కొన్నారు. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉండగానే ఆ రాష్ట్ర సీఎం జగన్  విశాఖపట్నమే రాష్ట్ర రాజధాని అంటూ దేశ రాజధానిలో ప్రకటించడం న్యాయవ్యవస్థను ఎద్దేవా చేయడమేనని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles