వివేకా హత్య కేసు : విజయమ్మను కూడా విచారించేల్సిందేనా?

Monday, May 6, 2024

వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి అంత్యంత దారుణంగా హత్యకు గురైన వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను ఇంకా కుదిపేస్తూ ఉంది. ఈ కేసులో తుడి చార్జిషీటు కూడా దాఖలయ్యాక.. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డిలను కూడా సీబీఐ నిందితులుగా చేర్చింది. అయితే దర్యాప్తులో సీబీఐ సేకరించిన రహస్య వాంగ్మూలాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్న కొద్దీ.. అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. వీటన్నింటినీ కలిపి పరిశీలించినప్పుడు.. వివేకా హత్య వెనుక ప్రధానమైన అంశాలు, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే.. వైఎస్సార్ సతీమణి విజయమ్మను కూడా విచారించాల్సి వస్తుందా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
కడప ఎంపీ సీటు షర్మిల లేదా విజయమ్మలలో ఎవరో ఒకరికి ఇవ్వాల్సిందిగా వివేకానందరెడ్డి చాలా పట్టుబట్టినట్టుగా ఇప్పటికే అనేక మంది వాంగ్మూలాల్లో రికార్డు అయింది. షర్మిల కూడా సీబీఐ తో ఇదే సంగతులు చెప్పినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా గతంలో సింహాద్రిపురం మండల పార్టీ కన్వీనరుగా పనిచేసి తర్వాత తెలుగుదేశంలో చేరిపోయిన కొమ్మా శివచంద్రారెడ్డి వాంగ్మూలం వెలుగుచూసింది.
ఆయనకూడా షర్మిల , విజయమ్మలలో ఒకరికి టికెట్ వస్తుందని వివేకానందరెడ్డి తనతో చెప్పినట్టుగా వెల్లడించారు. అవినాష్ రెడ్డికి జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వివేకా అన్నట్టు చెప్పారు. నిజానికి తన ఎంపీ టికెట్ కు అడ్డు పడుతున్నందునే వివేకా హత్యకు అవినాష్ పథకరచన చేసినట్టుగా ఆరోపణలున్నాయి.
ఇలాంటి ప్రచారం ముమ్మరంగా ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా షర్మిల పేరు కూడా వినిపిస్తున్నందున సీబీఐ ఆమెను కూడా పిలిచి విచారించడం జరిగింది. అయితే మరింత స్పష్టత రావడానికి, మరింత నిజం వెలుగుచూడడానికి.. వైఎస్ విజయమ్మను కూడా సీబీఐ పిలిచి విచారించాల్సి ఉంటుందేమోననే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.
కడప ఎంపీ టికెట్ దక్కే విషయంలో వివేకా మాటల ప్రకారం షర్మిల, లేదా, విజయమ్మ ఇద్దరూ రేసులో ఉన్నట్టే లెక్క. కేవలం షర్మిల నుంచి మాత్రమే ఆ వివరాలను , వాదనను ధ్రువీకరించుకుంటే సరిపోదని.. విజయమ్మతో కూడా మాట్లాడి.. వివేకానందరెడ్డి మనోగతం అదేనా? అనే విషయం సీబీఐ తేల్చుకుంటే కేసు మరింత పటిష్టంగా ఉంటుందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటికే దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో సీబీఐ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles