తెలంగాణ బీజేపీలో సంక్షోభకర పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీలో చేరేవారెవ్వరు కనిపించకపోగా, ఉన్న నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఇతర పార్టీల నుండి వచ్చిన ప్రముఖ నేతలు పార్టీలో తమకు తగిన మర్యాద దక్కటంలేదనే అసంతృప్తితో కొంతకాలంగా గడుపుతున్నారు.
ఇప్పుడు బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి ఉపఎన్నికలలో ఓటమి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చి కలవమని పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చినా ఢిల్లీలోనే ఉన్నప్పటికీ కలుస్తారన్నది సందేహాస్పదంగా మారింది.
స్వయంగా ఎంపీగా ఉన్న ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీలో కొనసాగుతున్న మాజీ కాంగ్రెస్ నేతలను చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నారు. దానితో ఆయన మొదటగా తమ్ముడిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయమై ఆయన సంకేతం ఇచ్చారు.
తాజాగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డి కె అరుణ, మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతిల కోసం కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడైంది. స్వయంగా ఈ విషయాన్నీ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సహ ఇన్‌చార్జి రోహిత్ చౌధురి ఢిల్లీలో ధ్రువీకరించారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు కలిసే తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
బీజేపీ నేతలు ఈటల రాజేందర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతితో చర్చలు జరుగుతున్నాయని వారు చెప్పారు. ఈ నేతలు బీజేపీలో ఇమడలేక పోతున్నట్లు వారు పేర్కొనడం గమనార్హం. డీకే అరుణ, ఆమె కుటుంభం సుదీర్ఘకాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. విజయశాంతి సహితం కాంగ్రెస్ నుండే బీజేపీలో చేరారు.
త్వరలో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరుల చేరికలు ఉంటాయని, ఆ తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతారని, ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయని మాణిక్ రావు ఠాక్రేవెల్లడించారు.
పైగా, గతంలో ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ కూడా రంగంలోకి దిగారని, తనకున్న పూర్వపు పరిచయాలతో బీజేపీ నేతలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. మరోవంక, బెంగుళూరు నుండి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహితం తెలంగాణాలో కాంగ్రెస్ లో నేతల పునరాగమనాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.