సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరంకు పైగా సమయం ఉన్నప్పటికీ ముందుగానే ఒకొక్క నియోజకవర్గంలో అభ్యర్థులను ఖరారు చేస్తూ, వారి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సారి సరికొత్త వ్యూహం అమలు పరుస్తున్నారు. ఇదివరకే ప్రకటించిన విధంగా 40 శాతం నియోజకవర్గాలలో యువకులు, కొత్తవారిని పోటీకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు.
అందుకోసమే పలువురు సీనియర్ నాయకులను పోటీ నుండి తప్పుకోవాలని, ఈ సారి కుటుంభం సభ్యులకు అవకాశం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. తుని నుండి యనమల రామకృష్ణుడు కుమార్తెను ఖరారు చేయడం గమనార్హం. ముందుగా లోక్ సభ అభ్యర్ధులలపై దృష్టి సారించిన చంద్రబాబు, కనీసం సగం నియోజకవర్గాలలో యువకులు, ఉన్నత విద్యావంతులు, కొత్తవారిని అభ్యర్థులుగా నిలబెట్టేందుకు చూస్తున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం టిడిపికి ముగ్గురే ఎంపీలు ఉన్నారు. వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్రియాశీల రాజకీయాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామమోహన్ నాయుడు ఈ సారి అసెంబ్లీకి పోటీచేయాలని చెప్పారని తెలిసింది. అసెంబ్లీకి ఎన్నికైతే మంత్రికావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక విజయవాడలో కేశినేని నాని వివాదాస్పదంగా మారారు. తరచూ పార్టీ నాయకత్వం పట్ల ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఆయన తమ్ముడిని అభ్యర్థిగా చేయాలనుకొన్న, ఆ విధంగా చేసినా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
అందుకొని మొత్తం 25 నియోజకవర్గాల్లో కొత్త అభర్ధులను ఎంపిక చేయడం ప్రారంభించినట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఎవ్వరూ ఊహించని కొందరు అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా విజయవాడ నుండి నారా బ్రాహ్మిణిని అభ్యర్థిగా లోక్ సభకు దింపాలని ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. 2019 ఎన్నికలతోనే ఆమె పేరు వచ్చినా, తనకు రాజకీయాలు, సినిమాలు అంటే ఇష్టం లేదంటూ చెప్పేసారు.
ఈ సారి ఆమెను దింపితే, కృష్ణ, గుంటూరు జిల్లాలో మంచి ప్రభావం ఉండగలదని భావిస్తున్నారు. మంచి వ్యాపారవేత్తగా ఇప్పటికే గుర్తింపు పొందిన ఆమె అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసిన ఆమెను పార్లమెంట్ కు పంపితే జాతీయ స్థాయిలో టిడిపి మంచి ఇమేజ్ ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచే అవకాశం ఉంటుందని భావిస్తూ ఈ విషయమై ఇప్పటికే చంద్రబాబు సర్వేలు జరిపిస్తున్నట్లు తెలుస్తున్నది.
మరోవంక, బ్రాహ్మణి సహితం విజయవాడ ప్రాంత రాజకీయాలను సున్నితంగా పరిశీలిస్తూ, అక్కడి పరిణామాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు, లోకేష్ సహితం ఆమెను రాజకీయాలలోకి తీసుకు రావాలని ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడవుతుంది.
అదే విధంగా అనకాపల్లి నుండి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్, హిందూపురం నుండి దిగవంత నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ లను అభ్యర్థులుగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమలాపురం నుండి మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ పేరును పరిశీలిస్తున్నారు. గత ఎన్నికలలో అనంతపురం నుండి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడిని అభ్యర్థిగా నిలబెట్టారు. వచ్చే సారి ఏమి చేస్తారో చూడవలసి ఉంది.