ఇప్పటి వరకు తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంభం సభ్యులు, మంత్రులు, పార్టీ నేతలు లక్ష్యంగా వరుసగా దాడులు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పుడు తమ దృష్టిని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైపు మళ్ళించిన్నట్లు తెలుస్తోంది. తాజాగా మంగళగిరి లోని ఎన్ ఆర్ ఐ హాస్పిటల్, దాని డైరెక్టర్లపై ఈడీ దాడుల్లో అందులో భాగంగానే చెబుతున్నారు.
ఈ దాడులు పూర్తి కాగానే, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన్నట్లు చెబుతున్న అక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాలని వారిని కోరింది.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని సిఐడి విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా, ఆ కేసులో పేర్కొన్న నిందితులకు ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. నోటీసులు పంపిన వారిలో మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. వారితో పాటు ఓఎస్డీ నిమ్మగడ్డ కృష్ణప్రసాద్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇన్‌వెబ్ సర్వీస్ నుంచి సీమెన్స్ తో పాటు డిజైన్ టెక్ కంపెనీకి నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ పక్కా ఆధారాలు సేకరించింది. కార్పొరేషన్ మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు చెందిన.. ప్రతీక్ ఇన్ఫో సర్వీసెస్‌కు కోట్ల రూపాయల మళ్లింపు జరిగినట్లు ఈడీ తేల్చింది. చంద్రబాబు ప్రభుత్వానికి జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చే విషయమై ఒప్పందం కుదిరింది.
చంద్రబాబు హయాంలో ఆయన కుమారుడు నారా లోకేష్ ఐటీ మంత్రిత్వ శాఖను నిర్వహించారు. కేవలం లోకేష్ పై కేసు నమోదు చేయడం కోసమే సిఐడి ఈ కేసు చేపట్టడం అందరికి తెలిసిందే. సుమారు రెండేళ్లుగా జగన్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేరుగా లోకేష్ ను ఇప్పటి వరకు ఇరికించలేక పోయింది.
దానితో ముఖ్యమంత్రి జగన్ ప్రోద్భలంతోనే ఈడీ ఈ నోటీసులు జారీ చేసినట్లు భావిస్తున్నారు. జనవరి 27 నుండి 2024 ఎన్నికలు లక్ష్యంగా లోకేష్ పాదయాత్రను చేబట్టబోతుండగా ఈ కేసులో ఈడీ చర్యలు ప్రారంభం కావడం గమనార్హం. జగన్ ప్రభుత్వంలో ఒక ఐజి స్థాయి పోలీస్ అధికారి కేవలం చంద్రబాబు, లోకేష్ లపై ఏదో ఒక కేసు నమోదయ్యేటట్లు చూడటం కోసం రాత్రియంబవళ్ళు పనిచేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు చెప్పుకోదగిన విజయం సాధించలేక పోవడంతో జగన్ తరచూ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం కోరినట్లు స్పష్టం అవుతున్నది.
మంగళగిరి ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ వ్యవస్థాపకులలో చాలామంది టిడిపి మద్దతు దారులే కావడం గమనార్హం. ఆసుపత్రి డైరెక్టర్లలో ఒకరిద్దరిని తమ వైపుకు తిప్పుకొని, మొత్తం యాజమాన్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వైసిపి ప్రభుత్వం గత రెండేళ్లుగా విఫల ప్రయత్నం చేస్తున్నది.
ప్రముఖ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి హాస్పిటల్ యాజమాన్యాన్ని కైవసం చేసుకొనే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్లలో చీలికలు తీసుకురావడంతో పాటు, అక్రమాలకు పాల్పడిన వారికి ప్రభుత్వం రక్షణగా ఉంటూ వస్తోంది. పోలీస్ కేసుల వరకు కూడా వెళ్ళింది. అయినా వారి లక్ష్యం నెరవేరక పోవడంతో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగినట్లు స్పష్టం అవుతుంది.