రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొడతారా… బిజెపిపై మండిపడ్డ కేసీఆర్ 

Tuesday, April 23, 2024

ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మండిపడ్డారు. రాష్ట్ర  ప్రభుత్వాన్ని  కూలగొడతామని స్వయంగా ప్రధానే ప్రకటిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్ర వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకు ప్రభుత్వాన్ని పడగొడతారా అని ప్రశ్నించారు.  

మహబూబ్‌నగర్‌‌లోని ఎంవీఎస్ కాలేజ్‌ ప్రాంగణంలో బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ఢిల్లీలో అసమర్థ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. పరిపాలన చేయడం చేతకాదు గాని ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొడతారా? అంటూ మోదీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని కేసీఆర్ ఆరోపించారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని జైళ్లో పెట్టినట్లు చెప్పారు. అనాడు ఎంతో మంది తమ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్య్రం తెచ్చింది ప్రభుత్వాలను కూలగొట్టేందుకేనా? అని ప్రశ్నించారు. 

 రైతులకు కరెంట్ సరఫరా చేయడం చేతకాదు.. పేదలను ఆదుకోవడం చేతకాదు.., ఉద్యోగాలివ్వడం చేతకాదు..మంచినీళ్లు సరఫరా చేయడం చేతకాదు కానీ బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను అమ్మడం మాత్రం తెలుసని అంటూ  కేసీఆర్ చురకలంటించారు. 

దేశంలో ఎక్కడి నుంచో  మోదీ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలు కావాలని స్పష్టం చేస్తూ అది తెలంగాణ నుంచే మొదలవనుందని కేసీఆర్ ప్రకటించారు.  త్వరలో దేశ రాజకీయాల్లోకి వెళ్తామని చెబుతూ అందుకోసం ప్రజల అనుమతి కావాలని కోరారు. 

తెలంగాణ పునాదుల మీదుగా జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిద్దామని పిలుపిచ్చారు. బీఆర్ఎస్తో తెలంగాణ లాగే దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మనతో సమానంగా కేంద్రం పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెబుతూ మోదీ సర్కార్ వల్ల తెలంగాణ రూ.3లక్షల కోట్లు కోల్పోయిందని తెలిపారు. కేంద్రం సహకరించి ఉంటే తెలంగాణ జీఎస్‌డీపీ ఇంకా పెరిగి ఉండేదని చెప్పారు. 

కృష్ణా జలాల్లో వాటా తేల్చేందుకు మోదీకి 8 ఏళ్లు కూడా సరిపోలేదా? అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాపై స్పష్టత ఇచ్చే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నానుస్తోందని మండిపడ్డారు. నీటి పంపకాలు జరపాలని 150 దరఖాస్తులు రాసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. నీటి వాటా గురించే ఇన్నేళ్లు సమయం తీసుకుంటే ఎలా అని కేంద్రాన్ని ప్రశ్నించారు

.కేంద్ర ప్రభుత్వం వైఖరి పైన పటారం.. లోన లొటారం.. చెప్పేది డంబాచారం అనేలా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణకు బీజేపీ నేతలు ఏమీ చేయరని, చేసేవారి కాళ్లల్లో కట్టెలు పెడతారని దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరించడం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరోవంక వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని కేంద్రానికి తీర్మానం పంపినా బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేని చెబుతూ మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చెప్పారు. 

తెలంగాణపై సవతి ప్రేమ ఒలకబోసే బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతాయని.. కానీ ఒక్క రూపాయి మాత్రం మంజూరు చేయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనూ అమలు కావడం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు బంధు పథకాలు లేవని గుర్తు చేశారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ప్రభుత్వాలు లేవా? మంత్రులు లేరా? మరి అక్కడ ఇలాంటి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో  రైతులకు ఉచితంగా కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇవన్నీ  ఓట్లు, చిల్లర రాజకీయాల కోసం ఇవ్వడం లేదని… రైతుల అభివృద్ధి కోసమే ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజలు గ్రామాల్లో చర్చ పెట్టాలని కోరారు. 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles