లోకేష్ యువ గళం పాదయాతపై వైసీపీలో గందరగోళం

Wednesday, January 22, 2025

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి చేబడుతున్న యువగళం పాదయాత్రపై అనుసరించవలసిన వైఖరి గురించి అధికార పక్షం గందరగోళానికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. ఒక పక్క ఇప్పటికే ఎందరో పాదయాత్రలు చేశారని, ఇదో మరో పాద యాత్ర అవుతుందని, దానికి ప్రాధాన్యతలేదని కొట్టివేసి ప్రయత్నం చేస్తున్నారు.

పాదయాత్ర చేస్తే బరువుతగ్గి ఆరోగ్యం మెరుగవుతుందని అంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. అయితే, ఈ యాత్ర వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 400 రోజులపాటు, 4,000 కిమీ దూరం చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో అంచనా వేయలేక సతమతమవుతున్నారు.

పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వాలా? వద్దా? యాత్రను పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకోవాలా? లేదా సాఫీగా జరిగేటట్లు మౌనం పాటించడం ద్వారా దాని ప్రాధాన్యతను తగ్గించాలా? అనే విషయాలపై ఒక నిర్ణయాలకు రాలేకపోతున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా హైకోర్టు ద్వారా అనుమతి పొందే అవకాశం ఉన్నదని అమరావతి రైతుల పాదయాత్ర స్పష్టం చేసింది.

పైగా, ప్రభుత్వం భయపడి అడ్డంకులు కలిగిస్తున్నదనే సందేశం ప్రజలకు వెళ్లే అవకాశం ఉంది. అడుగడుగునా వైసిపి శ్రేణులు అడ్డంకులు కలిపిస్తే టిడిపి శ్రేణులను రెచ్చగొట్టిన్నట్లు అవుతుంది. టీడీపీ శ్రేణులు మరింత పట్టుదలతో పెద్ద సంఖ్యలో చేరి, దూకుడుగా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడే అవకాశాలు ఉంటాయి.

పోలీసులు, ప్రభుత్వం అడ్డంకులు కల్పించడం ద్వారా యాత్ర ప్రాధాన్యతను తగ్గించలేమని, మరింత ఉధృతంగా సాగేందుకు సహకరించినట్లు అవుతుందని అమరావతి రైతుల పాదయాత్ర స్పష్టం చేసింది. పైగా, లోకేష్ పాదయాత్ర కోసం వినూత్నంగా సిద్ధం అవుతున్నారని, గతంలో జరిగిన పాదయాత్రలకు భిన్నంగా ఉండేటట్లు ప్రణాళిక వేసుకున్నారని చెబుతున్నారు. నం

ఇప్పటికే కుప్పంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు అడ్డంకులు కల్పించడం ద్వారా అధికారపక్షం మరింత ప్రతికూలతను ఎదుర్కోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. తిరిగి అటువంటి పొరపాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికే జీవో నం 1 అమలుపై హైకోర్టు స్టే ఇవ్వడం, ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు విముఖత వ్యక్తం చేయడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.

ఇలా ఉండగా, కుప్పంలో లోకేష్ యువ గళం పాదయాత్ర ను అడ్డుకునేందుకు వైసీపీ సిద్ధపడుతున్నట్లు వెల్లడవుతుంది. “పాదయాత్రను అడ్డుకోండి, దాడులకు సిద్దం కావాలి” అంటూ కార్యకర్తలను రెచ్చగొడుతూ వైసీపీ నేతలు మెసేజ్‌లు పంపుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం వైసీపీ నేత, ఎంపీపీ కోదండ రెడ్డి పేరుపై సోషల్ మీడియాలో ఈ మేరకు పంపిన మెసేజ్ ట్రోల్ అవుతోంది. 

‘‘యువ గళం పేరుతో కుప్పంలో పాదయాత్ర చేసే అర్హత నారా లోకేష్‌కు లేదు. టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో నిరుద్యోగ యువతకు భృతి కల్పిస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకోని లోకేష్. 14 ఏళ్ళు సీఎంగా, 35 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాధాన్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు కుప్పానికి ఏం చేశాడో చెప్పాలి…. లోకేష్ పాదయాత్రను కుప్పం ప్రజలారా అడ్డుకోవడానికి సిద్ధం కావాలి’’ అంటూ మెసేజ్‌ల్లో పేర్కొన్నారు.

అయితే, పార్టీ అధిష్ఠానం వ్యూహంలో భాగంగా ఈ విధంగా చేస్తున్నారా? స్థానికంగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? అనేడిది స్పష్టం కావలసి ఉంది. `గడప గడపకు వైసీపీ’ కార్యక్రమంలో భాగంగా పార్టీ ఎమ్యెల్యేలు జనం మధ్యలోకి వెడుతుంటే చాలాచోట్ల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాలగురించి నిలదీస్తుండటం కనిపించింది. అదే విధంగా ఈ పాదయాత్ర సహితం ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను మరింతగా ఉధృతం కావించే అవకాశం ఉందని అధికార పక్ష నేతలు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles