కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొన్ని విషయాలలో ఎంత మొండి పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటుందో అనడానికి తాజాగా మరో తార్కాణం ప్రపంచం కళ్ళ ముందు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న భారత మహిళా రెజ్లర్లు.. తమను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఒక వ్యక్తి మీద చర్య తీసుకోవాలని సామూహికంగా బజారున పడి కోరుతున్నప్పుడు కేంద్ర సర్కారు వారి డిమాండ్ పట్ల కనీసం స్పందించకుండా ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఉండడం చాలా చిత్రంగా కనిపిస్తోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కి వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై దేశమంతా అట్టుడుకుతోంది. రెజ్లర్లు తాము అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పతకాలను కూడా గంగలో పడేసి నిరసన తెలియజేయడానికి సిద్ధం కాగా వారం రోజులు ప్రభుత్వ స్పందన కోసం వేచి చూడాలని సర్దుబాటు మాటలతో వారిని ఊరడింప చేశారు. అయితే వారి మొర ఆలకించడానికి కూడా కేంద్రం వద్ద ఇప్పటిదాకా వ్యవధి లేకపోవడం చాలా దారుణం అనే భావన ప్రజల్లో వ్యక్తం అవుతుంది.
‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అనే ఆర్యోక్తిని విశ్వసించే హిందూ ధర్మాన్ని తమ రాజకీయ పార్టీకి వేదంగా భావించే భారతీయ జనతా పార్టీ, లైంగిక వేధింపులకు గురైన మహిళల ఆవేదన పట్ల స్పందించకపోవడం ఘోరమైన పరిణామం. బ్రిజ్ భూషణ్ కేవలం తమ కాషాయ దళానికి చెందిన ఎంపీ కావడం వలన ఆయన అకృత్యాలపై ఎవరేం మాట్లాడినా సరే తాము చర్య తీసుకోబోమని, నోరు మెదపబోమని అన్నట్లుగా బిజెపి దురహంకార వైఖరిని అనుసరిస్తోంది. యువ మహిళా రెజ్లర్లు తమకు జరిగిన అన్యాయాన్ని సిగ్గు విడిచి బహిరంగంగా చెప్పుకోవడమే పెద్ద విషయం. అయితే రోజుల తరబడి వాళ్ళ నిరసనలు దీక్షలు సాగుతున్నప్పటికీ కేంద్రం నామమాత్రంగా కూడా స్పందించడం లేదు.
మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు సాగించిన సమయంలో పంజాబ్ రైతులు కూడా ఇంతే పట్టుదలతో వ్యవహరించారు. ప్రభుత్వం కూడా ఇంతే మొండిగా పట్టు పట్టి కూర్చుంది. కానీ అన్నదాతల అలుపెరగని మడమతిప్పని పోరాటం వలన.. మోడీజీ దురహంకార ప్రభుత్వం మెట్టు దిగక తప్పలేదు. ఆ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టుగా మోడీ స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు బ్రిజభూషణ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్న క్రమంలో బిజెపి వైఫల్యం మహిళా లోకంలో వారి పరువు తీసేలా ఉంది. ఈ విషయంలో కూడా బిజెపి మెట్టు దిగక తప్పదని.. కచ్చితంగా బ్రిజ్‌భూషణ్ మీద చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం వస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు. కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో క్రీడాభిమానుల ముందు భారత ప్రభుత్వ పరువు సాంతం దిగజారి పోయేదాకా వారు స్పందించేలా కనిపించడం లేదు.