విశాఖకు రాజధాని ఇవ్వకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయమంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రకటన యాదృశ్చికంగా చేసింది కాదని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన వ్యూహంలో భాగమే అని తెలుస్తున్నది. ధర్మాన ప్రకటనపై వైసిపి నేతలు అందరూ మౌనంగా ఉండగా, రాయలసీమ నుండి బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఘాటుగా స్పందించడం గమనార్హం.
అమరావతి నుండి రాజధానిని అంటూ మార్చితే కర్నూల్ కు మార్చాలని ఆయన స్పష్టం చేశారు. నిధులు, నీళ్లు, నియామకాల విషయంలో అన్యాయం జరిగితే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాల్సిందేనని బైరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికే రాయలసీమ అన్ని విధాలుగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు.
గతంలో రాయలసీమ హక్కుల వేదిక పేరిట సంస్ధ ఏర్పాటు చేసి పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టుల విషయంలో కొట్లాడిన బైరెడ్డి గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కొంతకాలంగా వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
ముఖ్యంగా తనకు కంచుకోటగా భావిస్తున్న రాయలసీమలో సహితం ప్రతికూలత పెరుగుతూ ఉండడంతో రాయలసీమలో చిచ్చురేపే ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్నించడం లేదు. మాజీ మంత్రి ఎం వి మైసూరారెడ్డి, తిరుపతి ఎమ్యెల్యే కరుణాకర్ రెడ్డి సోదరుడు భూమన్ వంటివారు `రాయలసీమ మేధావులు’ పేరుతో కొన్ని సదస్సులో జరిపి, సీమకు జరిపే అన్యాయంపై పోరాడాలని స్థానికులలో కలకలం రేపే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.
అయితే, వారి ప్రయత్నాలు అన్ని జగన్ రాజకీయ ఎత్తుగడలతో భాగంగా భావిస్తూ చివరకు సొంత పార్టీకి చెందిన వారిలో సహితం స్పందన అంతంత మాత్రంగా ఉంటూ వస్తుంది. అయితే, ఇప్పుడు ధర్మాన ఎక్కడో శ్రీకాకుళంలో వదిలిన బాణానికి కర్నూల్ జిల్లాలోని బైరెడ్డి వంటి వారు స్పందించారంటే `ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం’ పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఎత్తుగడలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతుంది.
సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం మొదట్లో తెలంగాణ ప్రాంతంలో, కొంతకాలం రాయలసీమలో, ఇప్పుడు ఉత్తరాంధ్రలో విద్వేషాలు వ్యాపించే ప్రయత్నాలు చేస్తుండటం పట్ల గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలోని కోస్తా ఆంధ్ర ప్రజలలో అసహనం వ్యక్తం అవుతుంది. “మాకెందుకు ఈ తంటా, మా రాష్ట్రం మాకు ఇవ్వండి” అంటూ విజయవాడలో కొందరు సోషల్ మీడియాలో ప్రచారం కూడా ప్రారంభించారు.
గతంలో కాంగ్రెస్ లో ఆధిపత్యం కోసం తెలంగాణలోని పార్టీ ఎమ్యెల్యేలను సోనియా గాంధీ వద్దకు తీసుకెళ్లి, ప్రత్యేక తెలంగాణ గానం వై ఎస్ రాజశేఖరరెడ్డి వినిపించిన తరహాలోనే ఇప్పుడు జగన్ వ్యూహంలో భాగంగానే ఏపీలో ఏర్పాటువాద విషబీజాలు నాటే ప్రయత్నం జరుగుతున్నది. రాష్ట్రాభివృద్ధి దివాలాకోరుతనం నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం తప్పా మరో ప్రయోజనం కనిపించడం లేదు.
గతంలో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడి నుండి పరిపాలన జరపడం కష్టం అని గ్రహించి నీలం సంజీవరెడ్డి వంటి రాయలసీమ నేతలే అప్పటివరకు ఎన్నడూ ఎరుగని `తెలుగు వారికి ఒకే రాష్ట్రం’ అనే నినాదం తీసుకు వచ్చి, ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణాలో విలీనం చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు నాంది పలికారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రాంతాల ప్రజల భావాత్మక కలయికకు నాయకులు ఎటువంటి ప్రయత్నం చేయకపోవడంతో తిరిగి రెండు రాష్ట్రాలుగా విడిపోవాల్సి వచ్చింది. రాయలసీమ నాయకుల ఈ స్వార్ధ రాజకీయ ఎత్తుగడలతో మొత్తం ఆంధ్ర ప్రాంత అభివృద్ధి అడుగంటి పోయింది. తిరిగి ఇప్పుడు మరోసారి అభివృద్ధికి బాటలు వేసుకొనే సమయం వస్తే, మళ్ళి పాత పాటలు పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.