ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనకు వ్యతిరేకంగా విశాఖపట్టణంలో వెలిసిన ప్లేక్సీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. జన జాగరణ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
నగరంలో పలు చోట్ “రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రి కి స్వాగతం- సుస్వాగతం” అంటూ ఫ్లెక్సీలు కనిపిస్తోన్నాయి. ఫ్లెక్సీలు కట్టి జన జాగరణ సమితి ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా వినూత్న నిరసన చేపట్టింది. ఫ్లెక్సీలను ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
జగన్ బుధవారం విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. రాజధాని లేని ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. మరోవైపు రేపటి పర్యటనలో జగన్ భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆ తర్వాత తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు మిగులు పనులు, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణాలకు సంబంధించి శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత ఐటీ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేస్తారు.
మరోవంక, ఏపీలో ప్రభుత్వ రంగ సంస్ధగా ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునేందుకు కార్మిక సంఘాలు మలిదశ పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం భారీ ఆందోళనలకు పిలుపునిచ్చాయి. వీటిలో పాల్గొనాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు, ఉద్యోగులు, ఇతర వర్గాలకు పిలుపునిచ్చాయి.
దీంతో ఇప్పటికే రాష్ట్ర లారీ యజమానుల సంఘంతో పాటు పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రాస్తారోకోలకు సీపీఎం మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని పార్టీలు, సంఘాలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై, మోడీపై ఉమ్మడి పోరు సాగించాలని పిలుపునిచ్చింది.
ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్న ప్రదేశాలు, బహిరంగ సభా ప్రాంగణాలను ఇవ్వాళ వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.