రాజధాని అమరావతిలో అరెస్టులు, పోలీసుల నిర్బంధాలు

Monday, December 23, 2024

రాజధాని అమరావతిలో అరెస్టులకు, నిర్బంధానికి పోలీసులు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్టు 30 అమలులో ఉన్నాయంటూ నిరసనకారులపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఆర్‌5 జోన్‌కు వ్యతిరేకంగా బుధవారం తుళ్లూరు రైతు దీక్షా శిబిరంలో 48 గంటల దీక్షకు జై భీమ్‌ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్‌ కుమార్‌ పిలుపివ్వడంతో పోలీసులు నిర్బంధాలకు పాల్పడ్డారు.

మరోవైపు వైసిపి నేతలు పేదలకు సెంటు స్థలం పంపిణీకి మద్దతుగా బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించడంతో ఎలాంటి నిరసనలకూ అనుమతి లేదని, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఉదయం ఏడు గంటలకే భారీ సంఖ్యలో తుళ్లూరు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టారు.

శిబిరానికి ఎవరూ రావద్దంటూ తాళ్లను అడ్డుగా ఉంచారు. శిబిరానికి సమీపంలోని దుకాణాలను మూసివేయించారు. అప్పటికే దీక్షా శిబిరం వద్ద ఉన్న జడ శ్రావణ్‌ కుమార్‌తోపాటు కొంతమంది న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

శ్రావణ్‌ కుమార్‌ అరెస్టును నిరసిస్తూ దీక్షా శిబిరంలో నిరసనకు దిగిన అమరావతి బహుజన జెఎసి కన్వీనర్‌ చిలకా బసవయ్యను, రైతులను, మహిళా రైతులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్‌ వాహనం ఎక్కించారు. ఈ తోపులాటలో కింద పడిపోయిన ఒక మహిళకు గాయాలయ్యాయి.

పోలీసుల చర్యను తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద రైతులు తీవ్రంగా ఖండించారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత జెఎసి నాయకులు పులి చిన్నాను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. వెలగపూడి, మందడం, వెంకటపాలెం తదితర రైతు దీక్షా శిబిరాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

26న వెంకటపాలెంలో సిఎం సభ నేపథ్యంలో తమను భయపెట్టాలనే దుర్బుద్ధితో పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారని రైతులు విమర్శించారు. తుళ్లూరు స్టేషన్‌కు తరలించిన వారిని పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు.

అమరావతి రైతుల న్యాయం కోసం తాను అమరావతిలో దీక్షకు పూనుకుంటే పోలీసులతో భగ్నం చేస్తారా? అంటూ శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో ఎప్పుడైతే తన దీక్షను అడ్డుకున్నారో అపుడే ఈ ప్రభుత్వం పిరికిపందగా మారిందని ధ్వజమెత్తారు. తనను ఎక్కడైతే అడుగుపెట్టనివ్వమని విర్రవీగారో వారికిది చెంపపెట్టు అని, షంషేర్‌గా అక్కడ అడుగుపెట్టానని పేర్కొంటూ భవిష్యత్‌లో ఇదే విధంగా అమరావతి రైతుల తరపున పోరాడుతానని స్పష్టం చేశారు.

అమరావతి రైతులకు బాసటగా నిలబడటం తమ ప్రాథమిక హక్కని చెబుతూ  దీక్షకు కూర్చుంటే పోలీసులతో భగ్నం చేయిస్తారా? ఎవరి భూమిని ఎవరికి పంచుతారని ప్రశ్నించారు. అరెస్ట్ లకు వ్యతిరేకంగా జై భీమ్ భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం, నిరసనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బడుగు బలహీన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ఈనెల 26వ తేదీన జరగబోయే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, సోషల్ మీడియా ద్వారా ఇంటిదగ్గర నుంచే నిరసన వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ స్మృతి వనానికి న్యాయస్థానం అనుమతి తీసుకుని వెళ్తానని, పాదయాత్రతోపాటు దీక్ష కూడా చేస్తానని శ్రవణ్ తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles