మోదీజీ!  జగన్ ఆర్థిక సంఘం నిధులు దొంగలించారు!

Friday, December 20, 2024

కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  గ్రామ ప్రజలకు, సర్పంచులకు నిధులు అందకుండా సైంధవుడిలా అడ్డుపడి దిగమింగి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షులు వానపల్లి లక్ష్మీ ముత్యాల రావుల నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సర్పంచులు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే జోక్యం చేసుకొని తమ సర్పంచుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా తమ  నిధులను వెంటనే తిరిగి సర్పంచుల ఖాతాలో జమ చేపిచ్చే విధంగా  తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై తాము ఇచ్చినటువంటి ఫిర్యాదులను పరిష్కరించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం పంపిన 14వ  ఆర్థిక సంఘం నిధులు మొత్తం రూ.  8629.79 కోట్లను గ్రామపంచాయతీలు ఇవ్వకుండా, చెక్కుల మీద సర్పంచులు సంతకాలు లేకుండా, సర్పంచులకు చెప్పకుండా గ్రామపంచాయతీల సి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో నుంచి మా నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించి తన సొంత అవసరాలకు, పథకాలకు దారి మళ్లించి వాడి వేసుకున్నదని వారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 

ఇది అన్యాయం, అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకం, ఇది రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు వెన్నుపోటు పొడిచినట్లే కనుక ఆ రూ. 8629.79 కోట్లను తక్షణమే తిరిగి మా గ్రామ పంచాయతీలకు జమ చేసే విధంగా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.  ఈ సందర్భంగా 16 డిమాండులను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు.

ఆంధ్రప్రదేశ్ లోని 12,918 గ్రామపంచాయతీల్లో దొంగలు పడ్డారని పేర్కొంటూ ప్రధాని మోదీ దీనిపై విచారణ జరిపి తమ పంచాయతీ నిధులను తమకు ఇప్పించాలని వానపల్లి లక్ష్మి ముత్యాలరావు అభ్యర్ధించారు. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఏపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను , సచివాలయ కన్వీనర్లను నియమించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సభ్యులు రఘురాం కృష్ణంరాజు, కనకమేడల రవీంద్ర కుమార్ వారికి సంఘీభావం వ్యక్తం చేస్తూ సర్పంచుల సమస్యలు వారి వ్యక్తిగతమైనవి కావని, వారు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మూడు కోట్ల 50 లక్షల మంది గ్రామీణ ప్రజల తరఫున పోరాడుతున్నారని చెప్పారు. సర్పంచులకు వారి ఉద్యమాలకు అండదండలుగా ఉంటామని హామీ ఇచ్చారు. 

సర్పంచుల సమస్యల గురించి పార్లమెంట్ లో ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, పంచాయత్ రాజ్ శాఖ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేటట్లు చూస్తామని భరోసా ఇచ్చారు. అంతకు ముందు, సర్పంచులు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ నందు గల అంబేద్కర్ విగ్రహం దగ్గర మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతొందనీ అందుకే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి ఏపీ భవన్లో ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles