బిఆర్ఎస్ ఎంపీకి భూమి కేటాయింపుపై హైకోర్టులో చుక్కెదురు

Saturday, May 4, 2024

కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన కుటుంభం సభ్యులే కాకుండా పార్టీ ప్రముఖులు సహితం అడ్డదిడ్డంగా ప్రభుత్వ భూములను ఏదో ఒక రూపంలో కైవసం చేసుకోవడం జరుగుతున్నది. వేల కోట్ల రూపాయల విలువైన భూములను లీజ్ అనో లేదా కొనుగోలు అనో కారుచవుకగా ప్రభుత్వం కేటాయిస్తుంది. అందుకోసం అన్ని నియమనిబంధనలను బేతఖార్ చేస్తున్నారు.

తాజాగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త, బిఆర్ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డికి కాన్సర్ హాస్పిటల్ పేరుతో నామమాత్రపు లీజ్ కు 15 ఎకరాల భూమిని కట్టబెట్టడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ఆ కేటాయింపును రద్దు చేసింది. దానితో హెటిరో గ్రూప్ చైర్మన్ అయిన పార్థసారధి రెడ్డికి మాత్రమే కాకుండా అక్రమంగా భూకేటాయింపు జరిపిన కేసీఆర్ ప్రభుత్వంకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.

పార్థసారథి రెడ్డి మేనేజింగ్‌ ట్రస్టీగా ఉన్న సాయిసింధు ఫౌండేషన్‌కు 15 ఎకరాల భూమిని లీజుకు ఇస్తూ ప్రభుత్వం 2018లో జారీచేసిన జీవో 59ని హైకోర్టు కొట్టేసింది.  రాష్ట్ర ప్రభుత్వ భూకేటాయింపుల పాలసీ (జీవో నంబర్‌ 571, జీవో నంబర్‌ 218) ప్రకారం దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంచేసింది.

ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వం ట్రస్టీగా మాత్రమే వ్యవహరించాలని,  ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టేటప్పుడు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని ఈ సందర్భంగా ధర్మాసనం కఠినమైన పదజాలం ప్రయోగించింది.  ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయనే కారణంతో అక్రమ కేటాయింపులు చట్టబద్ధమైపోవని, నిర్మాణాలు జరుగుతున్నాయనేది అసలు గ్రౌండ్‌ కానేకాదని హైకోర్టు స్పష్టం చేసింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామంలోని సర్వే నెంబర్‌ 41లో  హైటెక్‌ సిటీ సమీపంలో అత్యంత విలువైన 15 ఎకరాల భూమిని హెటిరో డ్రగ్స్‌ చైర్మన్‌ పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ట్రస్టుకు 60 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ప్రభుత్వం 2018లో జీవో నంబర్‌ 59 జారీచేసింది.

ఈ జీవోను సవాల్‌ చేస్తూ డాక్టర్‌ ఊర్మిళ పింగ్లే, కె.సురేశ్‌కుమార్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 31న తీర్పు రిజర్వు చేసింది. సోమవారం ఆ తీర్పును వెలువరించింది.

‘‘సాయి సింధు ఫౌండేషన్‌కు 10 ఎకరాలు ఇవ్వాలని కలెక్టర్‌ సిఫారసు చేస్తే రాష్ట్రప్రభుత్వం దానికి ఐదెకరాలు కలిపి 15 ఎకరాలు కేటాయించింది. ప్రభుత్వం తన విచక్షణ ప్రకారం భూమి కేటాయించకుండా.. ప్రతివాది అడిగినంత భూమిని కేటాయించింది. అంతేకాకుండా ప్రతివాది అడిగినట్లు అలైన్‌మెంట్‌ను సైతం మార్చింది” అంటూ ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ భూకేటాయింపు పాలసీకి సంబంధించిన జీవోలు 571, 218ల్లోని 3 (హెచ్‌), (డీ) ప్రకారం లీజు నిర్ణయించాలని కలెక్టర్‌, తెలంగాణ స్టేట్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (కాంపిటెంట్‌ అథారిటీ) ప్రతిపాదించనప్పటికీ వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు. చదరపు గజానికి రూ.75 వేలు మార్కెట్‌ విలువ అని కాంపిటెంట్‌ అథారిటీ నిర్ణయించిందని హైకోర్టు తప్పుబట్టింది.

ప్రభుత్వం ఈ ధరను పట్టించుకోకుండా బసవతారకం ఆసుపత్రికి 1989తో ఇచ్చిన లీజు ధరకే ప్రస్తుత లీజును కేటాయించిందని చెబుతూ 1989లో బసవతారకం ఆసుపత్రికి స్థలం కేటాయించేటప్పుడు ఎలాంటి భూకేటాయింపు పాలసీ అమలు లేదని గుర్తు చేసింది. 1989లో నిర్ధారించిన లీజు రేట్లనే 2018లో అమలు చేస్తామనడం సమంజసం కాదని స్పషటం చేస్తూ హైదరాబాద్‌ నగరంలో 1989 నాటి భూముల ధరలకు, 2018 నాటి భూముల ధరలకు అసలు పోలికే లేదుని, భూముల ధరలు అనేక రెట్లు పెరిగాయని గుర్తు చేసింది.

పార్థసారథిరెడ్డి, సాయిసింధు ట్రస్ట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ ఎంపీ ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినివిస్తూ చనిపోయిన తన కుమార్తె పేరుపై ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సమాజానికి ఎంతోకొంత తిరిగి చెల్లించే ఉద్దేశంతో సేవచేయాలని పార్థసారథిరెడ్డి ముందుకు వచ్చారని  కోర్టుకు తెలిపారు. 500 పడకలతో ప్రపంచస్థాయి వసతులతో క్యాన్సర్‌ హాస్పిటల్‌ నిర్మించాలని తలపెట్టారని వెల్లడించారు.

ఆ ఆస్పత్రిలో 25 శాతం పడకలు పేదలకు ఉచితంగా ఇవ్వడంతోపాటు, 40 శాతం ఓపీ సర్వీసులు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బండా శివానంద ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ  సదరు భూమిని కేవలం లీజుకు మాత్రమే ఇచ్చామని, విక్రయించలేదని తెలిపారు. క్యాన్సర్‌ చికిత్స పేద ప్రజలకు మోయలేని భారంగా మారుతోందని గుర్తుచేశారు.

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ  రూ.500 కోట్ల కంటే ఎక్కువ విలువైన భూమిని అంత్యంత తక్కువ ధరకు లీజుకు ఇవ్వడం సమంజసం కాదని, కనీసం 10 శాతం అంటే రూ.50 కోట్లు లీజు మొత్తం తీసుకోవాల్సి ఉంటుందని, ప్రతి ఐదేళ్లకోసారి మార్కెట్‌ రేటు ప్రకారం ధరలు సవరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కానీ విలువైన భూమిని ఏడాదికి రూ.1.47 లక్షల చొప్పున మాత్రమే లీజుకు ఇస్తూ జీవో జారీచేశారని పేర్కొన్నారు. సదరు ట్రస్టు చైర్మన్‌కు గతంలో ఆస్పత్రి నడిపిన అనుభవం లేదని.. ఆయన డాక్టర్‌ కూడా కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

భూకేటాయింపు పాలసీ ప్రకారం ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వాలంటే సదరు భూమి మార్కెట్‌ విలువలో 10 శాతం విలువను ఏటా లీజుగా వసూలు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ లీజు మొత్తాన్ని ప్రతి ఐదేళ్లకోసారి పునఃసమీక్షించి.. పెరిగిన మార్కెట్‌ విలువ ప్రకారం 10 శాతం లీజు ఎంతో నిర్ణయుంచి వసూలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles