పసుపు-కమల బంధంపై 11న క్లారిటీ!

Saturday, May 18, 2024

కేంద్ర హోం మంత్రి తన ఆంధ్రప్రదేశ్ పర్యటనను కొన్ని రోజులు వాయిదా వేశారు. ఈనెల 8న విశాఖపట్నంలో అమిత్ షా బహిరంగ సభ జరగాల్సి ఉంది. దానికి సంబంధించి జనసమీకరణ సహా కమలనాయకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ లోగా విశాఖ రాకను అమిత్ షా 11వతేదీకి వాయిదా వేశారు. బిజీ షెడ్యూల్ వల్ల 8న రాలేనని సమాచారం పంపారు. మొత్తానికి మూడురోజుల తేడాతో 11న అమిత్ షా సభ జరుగుతుంది. ఈ సభలో తెలుగుదేశంతో మళ్లీ కుదుర్చుకోబోతున్న మైత్రీ బంధానికి సంబంధించి అమిత్ షా సంకేతమాత్రంగా తెలియజేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. తెదేపా- జనసేన- బిజెపి కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే తెలుగుదేశంతో పొత్తుపై రాష్ట్ర కమలదళాధిపతులు నోరు విప్పడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి, అమిత్ షా, జెపి నడ్డాలతో సుమారు గంటసేపు భేటీ అయి చర్చలు సాగించి వచ్చారు. ఈ నేపథ్యంలో పొత్తు కుదరడం తథ్యం అనే ఊహాగానాలు ముమ్మరంగా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని బిజెపి ఆలోచిస్తోంది. అయితే ఒంటరిగా పోటీచేస్తే ఏపీలో ఎప్పటికీ ఒక్కసీటు కూడా గెలవలేం అనే సంగతి వారి అధిష్టానానికి కూడా స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి కావాలంటే.. పూర్తిస్థాయిలో కేంద్రానికి ప్రతి సందర్భంలోనూ మద్దతిస్తారు గానీ.. పొత్తులు పెట్టుకోడానికి ఒప్పుకునే నాయకుడు కాదు. వారికి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం తెలుగుదేశం మాత్రమే. అందుకే అంతో ఇంతో తెదేపాతో పొత్తుకు మొగ్గుతున్నారు. వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటే జగన్ ను ఓడించడం సాధ్యం అని చంద్రబాబునాయుడు సుముఖంగానూ ఉన్నారు.
తాము గతంలోనూ గెలిచిన చరిత్ర ఉన్న విశాఖపట్నం ఎంపీ నియోజకవర్గాన్ని మళ్లీ గెలుచుకోవాలనే కోరిక భారతీయ జనతా పార్టీకి ఉంది. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి సభ నిర్వహించాలని అనుకున్నప్పుడు.. విశాఖను ఎంచుకోవడం కూడా అందుకే. అయితే ఆ విశాఖ సభలో అమిత్ షా, తెలుగుదేశంతో మైత్రికి సంబంధించి కొంత సంకేతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అమిత్ షా విమర్శల దాడి.. ఏకపక్షంగా జగన్ సర్కారు మీదనే సాగిపోయినట్లయితే, తెలుగుదేశంతో పొత్తు తథ్యమని అనుకోవచ్చు. అలాకాకుండా చంద్రబాబునాయుడు మీద కూడా విమర్శల జడివాన కురిపించారంటే గనుక.. తెదేపాతో పొత్తు ఉండదని అర్థం చేసుకోవాలి. అప్పుడిక జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తనవంతు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles