బిఆర్ఎస్ అస్త్రంగా తెలంగాణపై కేంద్రం వివక్షత!

Wednesday, December 18, 2024

ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనుకున్న రాష్ట్రాలకు మినహా ఇతర రాష్ట్రాల పట్ల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర వివక్షత చూపుతున్నట్లు తరచూ విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా బిజెపిని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధుల విషయంలో గాని, ప్రాజెక్ట్ ల విషయంలో గని ఎల్లప్పుడూ మొండిచెయ్యి చూపడం పరిపాటిగా మారింది.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కేంద్రం వద్ద దాసోహం అన్నరీతిలో ప్రభుత్వం ఉండడంతో అక్కడి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ కేసుల నుండి, అనేక అంశాలలో కేంద్రంలోని పెద్దలు భరోసాగా ఉంటున్నట్లు చెప్పుకొంటున్నారు. కానీ, బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేపట్టిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ పట్ల సంవత్సరాలుగా వివక్షత చూపుతున్నట్లు అనేక దాఖలాలు స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా, ఒకే రోజున పార్లమెంట్ లో ఇద్దరు కేంద్ర మంత్రులు సభ్యుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఈ అంశాన్ని స్పష్టం చేశాయి. మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణ పట్ల ఇటువంటి నిర్లక్ష్య ధోరణి ఆవలంభిస్తున్నారంటే చాలాకాలంగా ప్రచారం చేసుకుంటున్నట్లు ఇక్కడ అధికారంలోకి వస్తామనే బ్రమ్మలు తొలగిపోయాయని వెల్లడి అవుతుంది.

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఏర్పాటు కుదరదని ఇద్దరు కేంద్ర మంత్రులు  స్పష్టంచేశారు. తెలంగాణలో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అడిగిన ప్రశ్నకు వైష్ణవ్‌ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.

ఇప్పుడున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలు రోలింగ్‌ స్టాక్‌ల అవసరాన్ని తీర్చడానికి సరిపోతాయని, కొత్తగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడంలేదని పేర్కొన్నారు. అయితే గతంలో తమ ఎన్నికల ప్రణాళికలో వరంగల్ వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని బిజెపి హామీ ఇవ్వడం గమనార్హం. ఆ తర్వాత ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు తరచూ హామీలు ఇస్తున్నారు.

పైగా, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది. నేడు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దీనిపై మాట మార్చడం పట్ల నామా నాగేశ్వర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేటలో రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిరాకరించి వేలమంది యువత పొట్ట కొట్టేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దీనిని ఏర్పాటు చేసేంతవరకు కేంద్రంపై అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

కాగా, గత ఎన్నికలలో నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చూపిస్తానంటూ నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రస్తుత బిజెపి ఎంపీ డి అరవింద్ బాండ్ పేపర్ పై వాగ్దానం చేశారు. అయితే ఎన్నికల అనంతరం ఈ వాగ్ధానం మరచిపోయిన్నట్లున్నది.

తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్‌ లోక్‌సభలో బుధవారం తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు బోర్లకుంట వెంకటేశ్‌, రంజిత్‌ రెడ్డి, మాలోత్‌ కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పసుపు బోర్డుతో పాటుగా మరే స్పైసెస్ బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.

ఇలా ఉండగా,  హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ రెండోదశ ప్రాజెక్టు ఇవ్వబోమని కేంద్రం తెగేసి చెప్పింది. విభజన హామీ అయిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయబోమని మోదీ సర్కారు గతంలోనే ప్రకటించింది. విభజన హామీల మేరకు గిరిజన యూనివర్సిటీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గతంలో మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను కూడా రద్దు చేసింది.

 ప్ర‌ధాని మోదీ  ప్రాధాన్య‌త‌లో అసలు తెలంగాణే లేనప్పుడు, తెలంగాణకు ఏదీ ఇచ్చేడిది లేదంటున్నప్పుడు తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి? అని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి?? అని కేటీఆర్ నిలదీశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles