బండి సంజయ్ కొనసాగింపుపై `అసమ్మతి’ అల్టిమేటం!

Sunday, December 22, 2024

క్రమశిక్షణకు పేరొందిన బీజేపీలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు పలు రాష్ట్రాల్లో నివురుగప్పిన అసమ్మతి రెచ్చిపోయేందుకు దారితీస్తుంది. స్థానిక నేతల మాటలను ఖాతరు చేయకుండా, పార్టీ ప్రతిష్టను పట్టించుకోకుండా, పార్టీని బలోపేతం చేయగల సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం `భజనపరులు’గా ఉండేవారిని, మీడియా ప్రచారంకు పరిమితమై ఉండేవారిని రాష్త్ర అధ్యక్షులుగా, ఇతర కీలక పదవులలో నియమిస్తూ వస్తున్నారు.

కర్ణాటకలో పార్టీ ఘోర పరాజయంకు పార్టీ అధిష్టానం తీసుకున్న చర్యలే కారణం అని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. అన్ని దక్షిణాది రాస్త్రాలలో కేంద్రం నియమించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆయా రాష్ట్రాలలోని పార్టీ బలమైన నాయకులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.

మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టని పక్షంలో తమదారి తాము చూసుకుంటామని తెలంగాణాలో కీలక నాయకులు పార్టీ అధిష్టానంకు అల్టిమేటం ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది. అహంకార ధోరణితో పార్టీ వినాశనంకు దోహదపడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పదవిలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ను నియమించాలని పట్టుబడుతున్నారు.

కనీసం తొమ్మిది మంది సీనియర్ నేతలు ఈ విషయమై ఒకటిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. తమ గోడును పార్టీ అధిష్టానం పట్టించుకోని పక్షంలో తాము పార్టీ విడిచిపెట్టాల్సి వస్తుందని స్పష్టమైన హెచ్చరిక చేసినట్లు చెబుతున్నారు.  వీరిలో ఒకరిద్దరు తప్పా అందరూ ఇతర పార్టీల నుండి వచ్చి బీజేపీలో చేరిన వారే ఉన్నారు. గతంలో ఎంపీలుగా, ఎమ్యెల్యేలుగా పనిచేసిన వారున్నారు.

మరోవంక, బిజెపి అసమ్మతి నేతలను అక్కున చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు కధనాలు వ్యాపిస్తున్నాయి. ఈ విషయమై రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో బిజెపి నుండి బైటకు రమ్మనమని ఈటెల రాజేందర్ పై ఆయన మద్దతుదారులు తీవ్రమైన వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో రాజేందర్ హడావుడిగా సోమవారం ఢిల్లీ వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. ఆయన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది.

అసమ్మతి నేతలంతా అమిత్ షా తో సమావేశం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో బిజెపి ఓటమి చెందినప్పటి నుండి తెలంగాణాలో ఇతర పార్టీల నుండి ఎంతగా ప్రయత్నం చేస్తున్నా ప్రముఖులు ఎవ్వరు చేరడం లేదు. ఈ విషయమై స్వయంగా అమిత్ షా రాష్ట్ర నేతల ముందు ఇటీవల అసహనం వ్యక్తం చేశారు కూడా.

తెలంగాణలో టెన్త్ హిందీ పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్ అరెస్ట్ అయినప్పటి నుంచీ ఢిల్లీ పెద్దల దగ్గర ఆయన ప్రాబల్యం తగ్గిపోతున్నట్లు తెలుస్తున్నది. పైగా, పార్టీలో సీనియర్ నేతలు అందరూ సంజయ్ పట్ల ఇప్పటికే పలు సందర్భాలలో తమ ఆగ్రవేశాలను పార్టీ అధిష్టానం ముందు వ్యక్తం చేశారు. అందరిని కలుపుకొని పనిచేయమని ఢిల్లీ నేతలు ఎన్నిసార్లు చెప్పినా సంజయ్ తన పనితీరు మార్చుకోవడం లేదు.

ఒకవంక, కర్ణాకటలో ఎన్నికల ప్రచారంలో చివరిలో ప్రధాని మోదీ స్వయంగా `భజరంగ్ భలి’ అంటూ హనుమాన్ చాలీసా చదవమని పిలుపు ఇవ్వడం పార్టీకి వాస్తవానికి నష్టం కలిగించిందని, ముస్లింలు అందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ కు ఓటు వేసేటట్లు చేసిందని, అందుకనే జేడీఎస్ బాగా దెబ్బతిన్నదని విశ్లేషకులు అందరూ చెబుతున్నారు.

కర్ణాటక ఫలితాలు వచ్చిన మరుసటి రోజే కరీంనగర్ లో సంజయ్ `హిందూ ఏక్తా యాత్ర’ అంటూ జరపడం, దానికోసం అస్సాం సీఎం బిస్వా శర్మను ఆహ్వానించడం విమర్శలకు దారితీస్తుంది.  ఈ యాత్రలో తెలంగాణలోని బిజెపి ముఖ్యనేతలు ఎవ్వరూ పాల్గొనకపోవడం గమనార్హం. సంజయ్ ఒంటెత్తు పోకడలే తెలంగాణాలో పార్టీకి నష్టం చేస్తున్నాయని, మరెవ్వరు పార్టీవైపు చూడకుండా చేస్తున్నాయని విమర్శలు చెలరేగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles