ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో పార్టీ అధికారంలోకి రావాలని బిజెపి అగ్రనాయకత్వం ఒక వంక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, మరోవంక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల కారణంగా పార్టీలో చేరిన కొత్త నేతలు అభద్రతకు గురవుతున్నారు. వారంతా కలిసి `వేరే కుంపటి’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నా ఆయన ప్రతిసారీ `కొద్దిరోజులు లాగండి.. అన్ని సర్దుకుంటాయి’ అంటూ సముదాయించి పంపుతున్నారు. దానితో వారంతా అసహనానికి గురవుతున్నారు. మరొవంక, వారిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ఒక వైపు, వై ఎస్ షర్మిల మరోవైపు ప్రయత్నాలు చేస్తున్నారు.
బండి సంజయ్ ఒంటెద్దు పోకడలు పెరిగిపోయాయని, నియంతలా వ్యవహరిస్తున్నారని ఎప్పటి నుంచో బీజేపీలో కొనసాగుతున్న నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ బన్సల్ వద్ద తమ గోడు వెళ్లబుచ్చుకొంటున్నారు. సంజయ్ వ్యవహారశైలి నచ్చక చాలామంది పార్టీని వీడుతున్నారని, కొత్త నేతలెవరూ రావడం లేదని విమర్శిస్తున్నారు.
ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి నేతలంతా ఒక గ్రూప్‌గాఏర్పడి సంజయ్ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సమావేశాలకు సరిగ్గా ఆహ్వానించకపోవడం, పదే పదే అవమానాలకు గురి చేయడం, ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? అనే నిఘా పెట్టడం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవంక, ఇతర పార్టీల వారిని ఆకర్షించేందుకు ఈటెల రాజేందర్ అధ్యక్షతన చేరికల కమిటీ అంటూ ఒకటి వేసినప్పటికీ కొత్తగా ఎవ్వరు ఎందుకని పార్టీలో చేరడం లేదంటూ పార్టీ కేంద్ర నాయకత్వం సంజయ్ ను నిలదీస్తున్నట్లు తెలుస్తున్నది. పైగా, మరికొందరు పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం పట్ల అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంత్రి తర్వాత అమిత్ షాను కలసి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరగలరని కధనాలు వచ్చినా, ఇప్పుడు ఆ విషయమై మౌనం వహించడం సహితం బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్న ఈ పరిణామాలే కారణం అని చెబుతున్నారు. అందుకనే, స్వయంగా షర్మిల ఆయనకు ఫోన్ చేయడం, తన పార్టీలో చేరమని ఆహ్వానించడం జరిగింది.
బీజేపీలో తీవ్రమవుతున్న అంతర్గత కుమ్ములాటలు నిశితంగా గమనిస్తున్న బిఆర్ఎస్ నాయకత్వం సహితం అదనుచూసి అసంతృప్తి నేతలను తమ వైపు తిప్పుకొని విధంగా అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా, బండి సంజయ్ వ్యవహారాన్ని బిజెపి కేంద్ర నాయకత్వం సరిదిద్దలేని పక్షంలో తెలంగాణాలో బీజేపీ తీవ్ర పరాభవం ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతుంది.