సిబిఐ ప్రశ్నలకు తెలియదనే అవినాష్‌రెడ్డి జవాబులు!

Friday, April 19, 2024

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఎట్టకేలకు కడప ఎంపి వై ఎస్ అవినాష్‌రెడ్డి శనివారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. నాలుగున్నర గంటలసేపు జరిగిన విచారణలో చాల ప్రశ్నలకు తెలియదనే సమాధానాలు చెప్పిన్నట్లు తెలుస్తున్నది.

సిబిఐ ఎస్‌పి రామ్‌సింగ్‌ నేతృత్వంలోని ఐదుగురు బృందం నాలుగు గంటలకుపైగా ఆయనను ప్రశ్నించింది. వైఎస్‌ వివేకానందరెడ్డితో ఉన్న విభేదాలకు కారణాలేంటనే దానిపైనే సిబిఐ ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సిబిఐ సేకరించిన వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాధారాలను బట్టి ఆరా తీసింది.

వివేకా హత్య విషయం బైటకు తెలిసిన వెంటనే, ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించుకున్న తర్వాతే ప్రకటన చేశారా? హత్య జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలు, ఇతర సాక్ష్యాలను ఎందుకు తొలగించారు? అని సిబిఐ ఎస్‌పి ప్రశ్నించినట్లు తెలిసింది. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే 248 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ఆయా వాంగ్మూలాల ఆధారంగానే సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది.

ఈ దృష్ట్యా విచారణకు వీడియో, ఆడియో రికార్డింగ్‌ అనుమతి కోరానని, అందుకు అధికారులు అంగీకరించలేదని అవినాష్ రెడ్డి విచారణ అనంతరం మీడియాకు తెలిపారు. అయితే, విచారణ విషయాలు ఏవీ ఇప్పుడు బహిర్గతం చేయలేనని చెప్పారు.
మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో తన వ్యక్తిగత లాయర్‌, అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని కోఠిలోగల సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, అవినాష్‌రెడ్డిని మినహా ఇతరులెవ్వరినీ అధికారులు లోపలికి అనుమతించలేదు.

మరోవంక, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు విచారణ ప్రక్రియను ప్రారంభించింది. వివేకా హత్య కేసులో ప్రధాన, అనుబంధ చార్జ్‌షీట్ విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ కేసుకు SC/01/2023 నెంబర్‌ను న్యాయస్థానం కేటాయించింది. వివేకా కేసులో ఐదుగురు నిందితులకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.

ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి, శివశంకర్‌రెడ్డికి సమన్లు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 10న విచారణకు హాజరుకావాలని నిందితులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేక హత్య కేసును కడప నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

2019 మార్చి 15న మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య జరిగినప్పటి నుంచి నేటి వరకు సుమారు నాలుగేళ్ల వ్యవధిలో జిల్లా కేంద్రమైన కడప, పులివెందుల నుంచి బెంగళూరు వరకు వివిధ కోణాల్లో విచారించిన అనంతరం సిబిఐ బృందం 248 మంది నుంచి వాంగ్మూలాన్ని సేకరించింది. వీరిలో ఐదుగురిని ప్రధాన నిందితులుగా గుర్తించింది. వారిలో వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి అప్రూవర్‌గా మారారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles