ప్రతిపక్షాల కూటమి పేరు `ఇండియా’

Wednesday, January 22, 2025

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి రానీయకుండా చేయడం కోసం బెంగుళూరులో రెండు రోజులపాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల భేటీలో తమ కూటమికి `ఇండియా’ అని పేరు పెట్టారు.   ‘ఇండియా’ అంటే ఇండియన్ నేషనల్ డెమొక్రాటిక్ ఇన్ క్లూజివ్ అలయన్స్. తమ కూటమికి `ఇండియా’ అని నామకరణం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే సమావేశం ముగింపులో ప్రకటించారు.

కాంగ్రెస్ నాయకత్వంలో 2004 లో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ఏర్పడింది. ఈ కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. తాజాగా, అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడం కోసం రూపుదిద్దుకుంటున్న విపక్ష కూటమికి ఇండియా అనే పేరు పెట్టారు.

తమ కొత్త కూటమి పేరు `ఇండియా’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలుపుతూ ఇండియాను బిజెపి ఎదుర్కోగలదా? అని సవాలు విసిరారు. ఇకపై తమ ప్రచారం, పోరాటం అంతా ఇండియా పేరు మీదే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

తాము దేశం కోసం కలిశామని చెబుతూ బిజెపి ఎన్‌డిఎ కలిసి ఇండియా కటమిని ఎదుర్కోగలదా? అని ఆమె ప్రశ్నించారు. ఇండియా గెలుస్తుందని, బిజెపి ఓడిపోతుందని మమతా చురకలంటించారు. ఇండియా కూటమి విజయం సాధించడంతో దేశం గెలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

‘విపక్ష కూటమి భారత్ ను ప్రతిబింబిస్తుంది. అందుకే ఇండియా అనే పేరు కూటమికి సరిగ్గా సరిపోతుంది. ఈ పేరు కూడా బీజేపీ ని బాధ పెడుతుంది’ అని ఆర్జేడీ ఒక ట్విటర్ పోస్ట్ లో పేర్కొంది.  

 ‘‘2024 ఎన్నికలు టీమ్ ఇండియా కు టీమ్ ఎన్డీయే మధ్య జరగబోతున్నాయి’’ అని శివసేన ఉద్ధవ్ వర్గం నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. దానికి స్పందనగా చక్ దే ఇండియా అంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రీన్ ట్వీట్ చేశారు. ‘ఇండియా గెలవబోతోంది’ అని లోక్ సభ ఎంపీ మానికం టాగోర్ ట్వీట్ చేశారు.

ఇలా ఉండగా, తమ మధ్య ప్రధాని పదవి కోసం పోటీపడుతున్నారని బిజెపి చేస్తున్న ప్రచారాన్ని పరోక్షంగా మల్లిఖార్జున్ ఖర్గే కొట్టిపారేశారు.  కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంపైకాని, ప్రధాని పదవిపై కాని ఆసక్తి లేదని ఆయన ప్రకటించారు. ప్రతిపక్షాల సమావేశం రెండవ రోజున ప్రారంభోపన్యాసం చేస్తూ ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం అధికారాన్ని చేజిక్కించుకోవడం కాదని తేల్చి చెప్పారు. 

మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించుకోవడమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల మధ్య రష్ట్ర స్థాయిలో విభేదాలు ఉన్నమాట వాస్తవమే అని అంగీకరిస్తూ,  అయినప్పటికీ అవి సిద్ధాంతపరమైనవి కావని ఆయన చెప్పారు.

తమకు మద్దతు క్రమంగా పెరుగుతుందని చెబుతూ తాము పాట్నాలో మొదటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తమ కూటమిలో 16 పార్టీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు బెంగళూరులో 26 పార్టీలు వచ్చాయని అంటూ తదుపరి సమావేశం ముంబైలో జరుగుతుందని ప్రకటించారు.

బెంగళూరు సమావేశాలలో కాంగ్రెస్‌తోపాటు టిఎంసి, డిఎంకె, ఆప్, జెడియు, ఆర్‌జెడి, జెఎంఎం, ఎన్‌సిపి(శరద్ పవార్ గ్రూపు), శివసేన(ఉద్ధవ్ థాక్రే గ్రూపు), సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, అప్నా దళ్, నేషనల్ కాన్ఫరెన్స్, పిడిపి, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్(లిబరేషన్), ఆర్‌ఎస్‌పి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎండిఎంకె, విసికె, కెఎండికె, ఎంఎంకె, ఐయుఎంఎల్, కేరళ కాంగ్రెస్(ఎం), కేరళ కాంగ్రెస్(జోసెఫ్) పాల్గొన్నాయి.

విపక్షాల సమావేశానికి సోనియాగాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles