పొత్తులపై బిజెపికి ఖంగుతినిపించిన పవన్

Thursday, May 2, 2024

బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని స్పష్టం చేయడం ద్వారా ఆయనను ఆహ్వానించినా బిజెపి నేతలు సహితం ఖంగు తిన్నట్లు తెలుస్తున్నది. వైసిపిని గ‌ద్దె దింపే ల‌క్ష్యంతోనే టిడిపితో క‌ల‌సి పోటీ చేస్తామ‌ని చెప్పడం ద్వారా బిజెపి తమతో చేరకపోతే తమదారి తాము చూసుకుంటామని వెల్లడించినట్లయింది.

కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి అధికారంలో వచ్చేటట్టు చేయడం కోసం టిడిపితో జనసేన పొత్తు లేకుండా చేయడం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నట్లు కనిపిస్తున్నది. బీజేపీ దాగుడుమూతలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన వైఖరిలో ఉన్నట్లు స్పష్టమైంది. పరోక్షంగా `జగన్ తో కుమ్మక్కవుతారా? జగన్ ను ఓడించేందుకు మాతో చేతులు కలుపుతారా? తేల్చుకోండి” అన్నట్లు బిజెపికి సవాల్ విసిరినట్లయింది.

బీజేపీతో పొత్తు పెట్టుకొని నాలుగేళ్లు దాటినా ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో గాని, రాష్త్ర స్థాయిలో గాని ఒక్క సమావేశంపై కూడా పవన్ కళ్యణ్ ను ఆహ్వానించని నాయకత్వం మొదటిసారిగా రానున్న ఎన్నికలలో టిడిపికి దూరం చేసే ఎత్తుగడలో భాగంగా ఇప్పుడు ఆహ్వానించినట్లు తెలుస్తున్నది.

పైగా, ఈ మధ్య వారాహి విజయ యాత్రలో సహితం టిడిపితో పొత్తు గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడంతో ఆ పార్టీకి దూరమైనట్లే అనే ఆలోచనకు వచ్చారు.  వైసీపీతో నిస్సిగ్గుగా చేతులు కలుపుతున్న బీజేపీ ఆహ్వానం తిరస్కరించాలని మొదట్లో కొందరు జనసేన నేతలు సూచించినట్లు తెలుస్తోంది.  అయితే ఆహ్వానించడంతో దానిని మన్నించి హాజరుకావాలని పవన్ నిర్ణయించి వెళ్లారని చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని స్పష్టం చేయడం ద్వారా ఆ పార్టీని ఆత్మరక్షణలో పడవేసిన్నట్లయింది.

సొంతంగా పోటీ చేస్తే 1 శాతం ఓట్లు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందనే పవన్ కళ్యాణ్ వాదనతో విభేదిస్తే ఒంటరిగా మిగిలి, నవ్వులపాలవుతామనే ఆందోళన కూడా వారిని వెంటాడుతుంది. అప్పుడు వైఎస్ జగన్ కోసమే ఒంటరిగా పోటీచేస్తున్నారనే అభిప్రాయం జనంలో బలపడే అవకాశం కూడా ఉంది.

మరోవంక ముఖ్యమంత్రి పదవిని పంచుకోవాలనే డిమాండ్ చేయాలని బీజేపీ చేస్తున్న సూచనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కూటమిలో ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల ఫలితాల్లో బలాబలాలను బట్టి నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. పైగా, తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చేయడమే జనసేన విధానమని తెలిపారు. 

టీడీపీ, బీజేపీ, జనసేన 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని గుర్తుచేశారు. కొన్ని కారణాలతో 2019లో విడివిడిగా పోటీ చేసినట్లు తెలిపారు. బీజేపీ, జనసేన కలిసే ఉన్నయన్న పవన్ టీడీపీ, బీజేపీ సమస్యలపై మాట్లాడటం సరికాదంటూనే వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ ప్రకటించని సంగతి తెలిసిందే. పొత్తులపై పవన్ మరోసారి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఈ విషయంలో కప్పదాటు వైఖరి ఆవలంభిస్తున్న బిజెపి ఇరకాట పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles