ప్రజా కళాకారుడు గద్దర్(74) మరిలేరు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు కన్నుమూశారు. ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇటీవల జన సేనాని పవన్ కల్యాణ్ గద్దర్ ని ఆసుపత్రిలో కలిసి ధైర్యవచనాలు పలికారు. చివరికి ఆరోగ్యం విషమించి ఆదివారం తుదిశ్వాస విడిచారు. గద్దర్ మృతిపై అపోలో వైద్యులు ప్రకటన జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ అమీర్ పేట్ అపోలో ఆసుపత్రిలో మృతిచెందారు.
ఆయన ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో కన్నుమూశారని వైద్యులు తెలిపారు. జులై 20న గుండె సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 3న ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు వైద్యులు. ఆయన గుండె సమస్య నుంచి కోలుకున్నాయి. అయితే ఆయనకు గతంలో ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలు ఉన్నాయి. వయసు పైబడడంతో ఈ సమస్యలు మళ్లీ తలెత్తి ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు.
1949లో తూప్రాన్‌లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఎన్నో పాటలతో ఉద్యమానికి ఊపిరి పోశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్, మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. గద్దర్ తన గళంతో కోట్లాది మంది ప్రజలను చైతన్యవంతం చేశారు.
ఉద్యమాలలో భాగంగా ఊరురా తిరిగి ప్రచారం చేశారు. ఇందుకోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
గద్దర్ రాసిన పాటల్లో “అమ్మ తెలంగాణమా” అనే పాట పెద్దఎత్తున ప్రజాదరణ పొందింది. “నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ” పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు కూడా దక్కింది. అయితే ఆయన ఆ అవార్డ్‌ను తిరస్కరించారు. 1975లో కెనరా బ్యాంకులో క్లర్క్‌గా గద్దర్ చేరారు. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు విమల. ఆయనకు ముగ్గురు పిల్లలు– సూర్యుడు, చంద్రుడు (2003లో అనారోగ్యంతో చనిపోయారు), వెన్నెల ఉన్నారు.
మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు. యాదగిరి పాడిన ‘బండెనక బండి కట్టి’ అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. 1997 ఏప్రిల్ 6న పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఒక బుల్లెట్ ఆయన శరీరంలో ఇప్పటికీ ఉంది.
జై బోలో తెలంగాణా సినిమాలో తెరపై కూడా ఆయన కనిపించారు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ఎంతటి ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక “అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా” పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం విశేషం.