ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పై ఎన్నెన్నో అసత్య ఆరోపణలు చేస్తూ వచ్చారు. తాను అధికారంలోకి వస్తే సంవత్సరంలోగా నిర్మాణం పూర్తి చేస్తానని 2019 ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు నాలుగేళ్లు కావొస్తున్నది. ఇప్పట్లో, వచ్చే ఎన్నికలనాటికి కూడా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
పోలవరంలో భారీ అవినీతి జరిగిందని, అది చంద్రబాబు దోచుకున్నాడని అంటూ అంటూ విస్తృత ప్రచారం చేశారు. ఆయన ప్రచారానికి కొందరు `మేధావులు’ కూడా వంత పలికారు. అయితే అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి అవినీతిని కూడా బైటపెట్టలేక పోయారు. పెంటపాటి పుల్లారావు రాసిన లేఖకు పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని, విచారణ అవసరం లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్వయంగా స్పష్టం చేశారు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరానికి అసలు పునాదులు పడలేదని ఒకసారి, తరువాత 20% పనులు కూడా జరగలేదని మరోసారి విమర్శించారు. కానీ అధికారంలోకి వచ్చాక పోలవరంలో 71% పనులు జరిగాయని జగన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి 70% పనులు పూర్తి అయినట్టు సమాధానం ఇచ్చారు.
చంద్రబాబు రూ. 30 వేల కోట్లు అంచనాలు పెంచింది దోచుకోవడానికే అని జగన్ పెట్టపెట్టున విమర్శలు గుప్పించారు. ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయడమే కాకుండా సాక్షి పత్రికల్లో విషపు రాతలు రాయించారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు ప్రతిపాదించిన అంచనాలను ఆమోదించాలని కోరుతూ కేంద్రానికి వరుసగా లేఖలు వరాస్తున్నాడు.
రివర్స్ టెండర్ ద్వారా తక్కువ ధరకే పోలవరం పనులు ఇచ్చామని, దీనివల్ల రూ. 780 కోట్లు మిగులు వచ్చిందని ముఖ్యమంత్రి ప్రచారం చేశారు కానీ గతం కంటే ప్రధాన డ్యామ్ రూ. 1,656 కోట్,లు కుడి కాలువ ఎత్తిపోతలకు రూ. 912 కోట్లు, ఇసుకకు రూ. 500 కోట్లు అంచనాలు పెంచారు. ఒక్క రోజులో హెడ్ వర్క్ రూ. 2569 కోట్లు పెరిగింది
మొదట 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాట తప్పి 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అప్పటి సాగునీటి మంత్రి అనిల్ కుమార్ ప్రకటించాడు. ఇప్పటి మంత్రి అంబటి రాంబాబు అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని అంటూ చేతులెత్తేస్తున్నారు.
పోలవరానికి కేంద్రం సాయం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం కట్టలేదా?అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన జగన్ రెడ్డి ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇవ్వనిదే కట్టలేమని స్పష్టం చేస్తున్నారు. బకాయిలు చెల్లింపమని ప్రధానిని కలిసినప్పుడల్లా వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నాడు. కేంద్రం నుండి నిధులు రావడం లేదు, పోలవరం పనులు ముందుకు సాగడం లేదు.
పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని నాడు జగన్ విమర్శించారు. కానీ పట్టిసీమ ప్రాజెక్టులో రూ. 400 కోట్ల అవినీతి కేవలం ఆరోపణలు మాత్రమే అని, అందుకు ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ ఆయన సీఎంగా ఉండగానే తేల్చి చెప్పింది