పొంగులేటికి కాంగ్రెస్ లో చుక్కెదురు … బిజెపి వైపు అడుగులు!

Sunday, January 19, 2025

బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏపార్టీలో చేరాలనే విషయంలో నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేక పోతున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించే పార్టీలో చేరతానని ప్రకటించిన ఆయన ముందు కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కనిపిస్తున్నాయి.

అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపికి ఎటువంటి బలం లేకపోవడంతో ఆ పార్టీలో చేరడం ద్వారా కేసీఆర్ వ్యతిరేక ఓట్లను చీల్చి, బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు దారితీస్తుందని పొంగులేటి మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ ఓటమితో పాటుగా తమ వర్గానికి చెందిన కొద్దిమందిని గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ లో చేరడమే మార్గమని కూడా స్పష్టం చేస్తున్నారు.

అయితే తనతో పాటు తన మద్దతు దారులకు కూడా ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలనే పొంగులేటి షరతు కాంగ్రెస్ లో చేరేందుకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఆ పార్టీకి ఆ జిల్లాలో పలువురు బలమైన నాయకులు ఉన్నారు. వారందరిని కాదని పొంగులేటి చెప్పినవారికి మాత్రమే సీట్లు ఇవ్వాలంటే కుదిరేది కాదని ఆ పార్టీ నాయకులు తేల్చి చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంతో కూడా పొంగులేటి చర్చలు జరిపినా అవి కొలిక్కి రాలేదు. పొంగులేటి పెట్టే షరతులకు తమకు అమోదయోగ్యం కాదని పలువురు కాంగ్రెస్  నేతలు బహిరంగంగానే తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి వంటి నాయకులు పొంగులేటి షరతులను కొట్టిపారవేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని పలువురు ఖమ్మం కాంగ్రెస్‌ నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. పొంగులేటి అవసరం పార్టీకి ఏమాత్రం లేదని, తమకొద్దని స్పష్టం చేస్తున్నారు.

ఇటువంటి పరిస్థితులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన అభ్యర్థులకు చూస్తున్న బీజేపీ పొంగులేటిని ఆకట్టుకొని, పార్టీలో చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్‌, ఎమ్యెల్యే ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలు గురువారం ఖమ్మానికి వచ్చి పొంగులేటితో భేటీ కాబోవడం ప్రాధాన్యతను సంతరింప చేసుకుంది.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఖమ్మంలో పొంగులేటితో భేటీ కానున్నారు. బిఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత బీజేపీలోకి రావాలని ఈటల రాజేందర్‌ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలోనే ప్రచారం సాగింది.

రెండు జాతీయ పార్టీల ముఖ్య నేతలు తనను సంప్రదిస్తున్నారంటూ మాజీ ఎంపీ పలుమార్లు ప్రకటించారు. పొంగులేటిని తమ పార్టీలో చేరమని స్వయంగా ఆహ్వానించినా వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారంటూ ఈ మధ్య చెప్పడం గమనార్హం. రాజకీయాలలో ఒక నిర్ణయం తీసుకొని, ముందుకు వెళ్లకపోతే వెనుకబడిపోతామని ఆమె సున్నితంగా ఈ సందర్భంగా వారించారు కూడా.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles