పడకేసిన వైసిపి రీజినల్‌ కోఆర్డినేటర్ల వ్యవస్థ

Sunday, May 5, 2024

`వైనాట్ 175′ నినాదంతో 2024 ఎన్నికలలో రాష్ట్రంలో మరోసారి ఘనవిజయం సాధించేందుకు పార్టీని సంసిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ పడకేసిన సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూర్ జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ పదవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడంతో ఈ వ్యవస్థ గురించిన ప్రశ్నలు ఆ పార్టీలో తలెత్తుతున్నాయి.

మిగిలినవారు పేరుకు ఆ పదవులలో కొనసాగుతున్నా పెద్దగా దృష్టి సారించడం లేదని, అప్పుడప్పుడు మొక్కుబడిగా మాత్రమే కనిపిస్తున్నారని, అందరూ తమ తమ నియోజకవర్గాలపైననే దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. మొదటి కేబినెట్‌ మార్పు అనంతరం తొలగించిన వారిలో కొంత మందిని ఎంపిక చేసిన సీఎం జగన్‌ వారినిపార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లుగా నియమించి ఒక్కొక్కరికి మూడు, నాలుగు జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

వీరు వారికి కేటాయించిన జిల్లాల్లో తిరుగుతూ నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే, ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఆశించిన మేర పనిచేయడంలేదన్న భావనతో వారిలో నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), అనీల్‌ కుమార్‌య యాదవ్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌లను తప్పించి కొత్తగా మరో టీంను ఏర్పాటు చేశారు.

తాజాగా మొత్తం 8 మందితో రీజి నల్‌ కోఆర్డినేటర్ల వ్యవ స్థను ఏర్పాటు చేసినా పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. సీనియర్‌ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లా లు, మరో సీనియర్‌ నేత, మంత్రి బొత్స సత్య నారాయణకు పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామ రాజు, శ్రీకాకుళం జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

అలాగే మరో సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డికి విశాఖపట్టణం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలు, ఎంపీలు మిధున్‌ రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖరల్‌లకు కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలు కేటాయించారు.

 తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, బీదా మస్తాన్‌ రావులకు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలు, ఆకేపాటి అమర్నాథ రెడ్డికి కర్నూలు, నంద్యాల జిల్లాలు, బాధ్యతలు అప్పగించారు.అయితే వీరిలో కేవలం మంత్రి రామచంద్రదరెడ్డి మాత్రమే తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.

వైవి సుబ్బారెడ్డి సహితం అప్పుడప్పుడు విశాఖపట్నం వెడుతున్నా ఆయన పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నారని  ఇటీవల జరిగిన ఎమ్యెల్సీ ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. ఆయన దృష్టి అంతా ప్రకాశం జిల్లాపై ఉంటుందని చెబుతున్నారు.  బొత్స సత్యనారాయణ అప్పుడప్పుడు తానూ ఉన్నాననే చూపించే ప్రయత్నం చేస్తున్నారు గాని నాయకుల మధ్య వివాదాల పరిష్కారం పట్ల ఆసక్తి చూపడం లేదు.

ఇక మిగిలిన వారెవ్వరూ కూడా తమకు కేటాయించిన జిల్లాల బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆయా జిల్లాల పరిధలోని నియోజకవర్గాల్లో నేతల మధ్య ఏవైనా అభిప్రాయ బేధాలు ఉంటే వాటిని చక్కదిద్దవలసి ఉన్నప్పటికీ అటువంటి ప్రయత్నాలు ఎవ్వరూ చేయడం లేదు. ఇప్పటికే దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీలో కుమ్ములాటలు ప్రత్యక్షం అవుతుంటే వాటిని సరిదిద్దే ప్రయత్నం ఎవ్వరు చేయాలన్నది నేడు ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles