వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని అధినేత. ఆ పార్టీ ఆయన సొంతం. ఆయన నిర్మించుకున్న పార్టీ అది. పార్టీలో ఎవ్వరైనా సరే.. ఆయనకు విధేయులుగా ఉండాల్సిందే. ఇప్పటిదాకా పార్టీలో ఆయన మాటకు తిరుగులేని విధంగానే నడుస్తోంది. పదేళ్లపైబడిన ప్రస్థానంలో ఆ పార్టీ నాలుగేళ్లుగా మాత్రమే అధికారంలో ఉంది. అయితే ఇప్పుడే.. పార్టీ మీద జగన్ పట్టు సడలుతోందా? అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. జగన్ మనోగతానికి వ్యతిరేకంగా.. పార్టీ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చూడబోతే.. పిల్లి సుభాష్ చంద్రబోస్ అందరికీ ఒక తిరుగుబాటు బాటను తీర్చిదిద్దినట్లు అయింది. అందరూ దానినే అనుసరిస్తున్నారు. ఇప్పుడు గన్నవరం వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు కూడా.. అచ్చంగా ‘పిల్లి’ పలుకులనే పలుకుతున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి చెందిన వల్లభనేని వంశీమోహన్ గెలుపొందారు. వైసీపీకి చెందిన యార్లగడ్డ వెంకట్రావు కేవలం 990 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల పర్వం తర్వాత.. వంశీ వైసీపీ తీర్థం అనధికారికంగా పుచ్చుకుని, జగన్ పంచన చేరారు. అప్పటినుంచి నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణమే ఉంది. వంశీ టికెట్ గ్యారంటీ హామీతోనే వైసీపీ గూటికి రావడం జరిగింది. వైఎస్ జగన్ కూడా.. సిటింగులు అందరికీ టికెట్లు ఇస్తాను అనే మాట మీదే ఉన్నారు. అయితే ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో కూడా ముసలం బయటపడుతోంది.
వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీచేసి తీరుతానని యార్లగడ్డ వెంకట్రావు తేల్చి చెబుతున్నారు. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన, వైసీపీ పార్టీ తరఫున పోటీచేస్తానా? లేదా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుందని అంటున్నారు. తెలుగుదేశంలో మాత్రం చేరే ఆలోచనే లేదని అంటున్న యార్లగడ్డ, పోటీ విషయంలో మాత్రం నిశ్చితాభిప్రాయంతోనే ఉన్నారు. కేవలం 990 ఓట్ల తేడాతో ఓడిపోయిన నాయకుడిని.. ఫిరాయింపు నాయకుడి వలన ఎన్నికలకు దూరం కమ్మని చెప్పడం బాధగానే ఉంటుంది.
అయితే వైసీపీలో ఇలాంటి తిరుగుబాట్లు నిన్నటిదాకా అనూహ్యమైనవి. ఇప్పుడు జగన్ ఆధిపత్యాన్ని, ఏకపక్ష నిర్ణయాధికారాన్ని నాయకులు ఖాతరు చేస్తున్నట్టుగా లేదు. రామచంద్రపురం నియోజకవర్గనంలో మంత్రి వేణుకు వ్యతిరేకంగా.. ఇండిపెండెంటుగా అయినా పోటీచేసి తీరుతానని పిల్లి సుభాష్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే.. గన్నవరంలో యార్లగడ్డ అదే మాట చెప్పడం విశేషం.