పరువు పట్టించుకోవడం మానేశారు!

Saturday, September 7, 2024

తెలంగాణలో వామపక్షాలకు ఖచ్చితంగా కొంత బలం ఉంది. అయితే తమంత తాముగా ఎన్నికల్లో నెగ్గేంత బలం వారికి ఉన్నదా? అంటే ప్రశ్నార్థకమే. అందుకే అగ్ర పార్టీల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలని గెలవాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అయితే, సిద్ధాంతాల బలం ఉన్న పార్టీలే అయినప్పటికీ.. వాటి పట్టింపే లేనట్టుగా.. ఎవరు దొరికితే వారితో పొత్తులు పెట్టుకోవడానికి ఎగబడడం ద్వారా వామపక్షాలు తమ పరువు పోగొట్టుకుంటున్నాయని ప్రజలు భావిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో భారాస వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. వారి మద్దతు తీసుకుంది. ఆ సందర్భంగా పొత్తులు కొనసాగుతాయని కేసీఆర్ అన్నమాట వాస్తవం. అయితే.. ఆ తర్వాతి పరిణామాల్లో తెరాస.. జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేయాలనే కేసీఆర్ కోరికలు ఫలించలేదు. కానీ ఆ కూటమిలోకి వామపక్షాలు చేరిపోయి కాంగ్రెస్ కు జైకొట్టాయి.

అయితే ఆ పార్టీల జాతీయ స్థాయి నిర్ణయాలకు భిన్నంగా.. తెలంగాణ శాఖలు మాత్రం.. భారాస ద్వారా లబ్ధి పొందాలని అనుకున్నాయి. మునుగోడు సాయానికి ప్రతిగా తమకు సీట్లు కావాలని వారు ఆశించారు. ఇం.డి.యా. కూటమిలో తాము భాగం అనే సంగతి వారు మర్చిపోయారు. కానీ వారిని కేసీఆర్ పట్టించుకోకపోయినా.. చివరివరకు బేరసారాలు చేస్తూ వచ్చారు. వారి పరువు మొత్తం మంటగలిసేవరకు కేసీఆర్ దయ కోసం నిరీక్షించారు. వారు ఎంతగా ఒత్తిడిచేసినా, ఒకటికి మించి అసెంబ్లీ సీటు ఇచ్చేది లేదని చెప్పిన తర్వాత.. తాము సొంతంగా పోటీచేస్తాం అని ప్రకటించి.. ఇప్పుడు కాంగ్రెసు ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు.

కాంగ్రెసు పార్టీ ఇన్చార్జి థాక్రేతో సమావేశమైన సీపీఐ నాయకులు.. అక్కడ మళ్లీ కూరగాయల బేరాలు ప్రారంభించారు. కేసీఆర్ తో బేరమాడినంత సేపూ.. మూడు అడిగి.. కనీసం రెండు ఇస్తే చాలని బతిమాలి.. ఒకటికంటె ఎక్కువ ఇచ్చేది లేదన్న తరువాత.. పొత్తు వద్దనుకున్నారు. ఆ సంగతి వార్తలు కూడా వచ్చాయి. బహిరంగ రహస్యం. అయితే కాంగ్రెస్ తో చర్చలకు కూర్చోగానే.. నాలుగుతో మొదలెట్టి.. వారు రెండు ఆఫర్ చేస్తోంటే.. కనీసం మూడు ఇవ్వండని బతిమాలుతున్నరు. భారాస అయితే రెండుచాలని అడిగిన తర్వాత, వారు అడిగినట్టుగా మూడు ఇస్తే గనుక కాంగ్రెస్ చేతగాని పార్టీ అనే ముద్ర వస్తుంది. ఈ సమీకరణాలను కూడా పట్టించుకోకుండా.. కమ్యూనిస్టులు ఎవరు కుదిరితే వారు అన్నట్టుగా బేరసారాలకు దిగుతూ.. తమ పరువు తామే తీసుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles