నిస్సత్తువుగా తెలంగాణ బిజెపి… ముభావంగా బండి సంజయ్

Wednesday, December 18, 2024

నిన్నటి వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణాలో అధికారం తమదే అంటూ ధీమాగా చెప్పుకోనే బిజెపి నేతలలో ఇప్పుడు అయోమయం నెలకొన్నది. పార్టీలో చేరికలు ఆగిపోవడం, మరోవంక కర్ణాటక ఎన్నికల అనంతరం కాంగ్రెస్ లో జోష్ పెరగడం, బీజేపీలో చేర్పించేందుకు ప్రయత్నించిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతూ ఉండడంతో రాష్త్ర బిజెపి నాయకులంతా ముభావంగా కనిపిస్తున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ను మార్చనిదే తాము పార్టీలో కొనసాగలేమని ఇతర పార్టీల నుండి వచ్చిన పలువురు నేతలు స్పష్టం చేయడంతో కేంద్ర నాయకత్వం యేవో కొన్ని మార్పులు చేయబోతున్నట్లు సంకేతాలు వెలువడడంతో అసలేమీ జరుగుతుందో తెలియక ఖంగారులో కనిపిస్తున్నారు.

ఇటువంటి పరిస్థితులలో ఈ నెల 8న అధికార పర్యటనకై వరంగల్ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాక పట్ల పార్టీ శ్రేణులలో ఎప్పుడూ కనిపించే ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆదివారం వరంగల్ కు వచ్చిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర నేతలు ఎవ్వరికీ వారు ముభావంగా కనిపించారు.

ఈ సందర్భంగా జరిగిన సన్నాహక సభలో ప్రసంగిస్తూ ప్రధాని వచ్చే సమయానికి తాను రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటానో, లేదో అంటూ సంజయ్ విరక్తిగా మాట్లాడటం అనుకోకుండా వచ్చిన రాష్ట్ర అధ్యక్ష పదవి పోతుందంటే ఆయన తీవ్రమైన మనస్థాపంకు గురవుతున్నట్లు వెల్లడయింది. కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులతో కలిసి అక్కడ ఏర్పాట్లను సమీక్షించిన సంజయ్‌.. అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. మీడియా సమావేశంలో సహితం ముక్తసరిగా మాట్లాడారు.

మూడు రోజుల క్రితం రాష్ట్ర అధ్యక్ష మార్పు ఆలోచన లేదని, తాను ఆ పదవి చేపట్టే ప్రస్తావన రాలేదని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఈ విషయమై మౌనం వహిస్తున్నారు. అయితే తనకు అధ్యక్ష పదవిపై ఆసక్తి లేదని అమిత్ షాకు చెప్పిన్నట్లు మాత్రం మీడియాకు లీక్ ఇచ్చారు. ఏదైమైనా కేంద్ర మంత్రిగా కొనసాగుతూ, రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పదవి చేబట్టబోతున్నారంటూ ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.

మరోవంక, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై తనతో ఎవరూ చర్చించలేదని బీజేపీ పార్లమెంటరీ కమిటీ సభ్యులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ చెప్పారు. ఆయన సహితం ఈ విషయంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు మరో మంత్రి పదవి అంటూ ఇస్తే తనకే వరిస్తుందని ధీమాతో ఆయన కనిపిస్తున్నారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలో తీసుకొనే అవకాశాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సంజయ్ ను పార్టీ అధ్యక్షునిగా మారుస్తున్నారంటూ వస్తున్న వార్తల పట్ల మాజీ ఎంపీ విజయశాంతి మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగే దాకా బండి సంజయే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతారని రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌ స్పష్టంగా ప్రకటించినా ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

అధ్యక్ష మార్పు లేదని, నాలుగు రోజుల కిందట కూడా తరుణ్‌ఛుగ్‌ పునరుద్ఘాటించారని ఆమె గుర్తుచేశారు. సంజయ్‌ని మారుస్తున్నారంటూ ప్రచారం చేసేవాళ్లు, అందుకు కారణం ఏంటో మాత్రం చెప్పడం లేదని విజయశాంతి పేర్కొన్నారు. ఏదేమైనా మొన్నటి వరకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలను యెట్లా ఎదుర్కోవాలనే మిషన్ మూడ్ లో ఉన్న తెలంగాణ బిజెపి నేతలు ఇప్పుడు నిస్సత్తువుగా కనిపిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles