నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర 1000 కి మీ పూర్తి

Wednesday, January 22, 2025

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన `యువగళం’ పాదయాత్ర శుక్రవారం 77వ రోజులోకి చేరుకోగా, ఆదోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద నేటితో 1000 కిలోమీటర్ల మైలురాయిని  పూర్తి చేసుకున్నారు. జనవరి 27న కుప్పం నుండి ప్రారంభించారు, ఇప్పటికే ఉమ్మడి చిత్తూర్, అనంతపూర్ జిల్లాల్లో పూర్తిచేసుకొని కర్నూల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.

గురువారం సాయంత్రమే ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ యువగళం పాదయాత్రకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం పాదయాత్ర  ఆదోని టౌన్‌లోకి చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం యువగళం పాదయాత్ర ఆదోని టౌన్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్‌ను చూసేందుకు మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చారు. యువగళం పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటిన సందర్బంగా లోకేష్  ఎమోషనల్ ట్వీట్ చేశారు:

‘నేను 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నాను. దానిని సాధ్యమయ్యేలా చేసిన ప్రజలకు నమస్కరిస్తున్నా. రాయలసీమ ప్రజలకు జేఎంఆర్‌ (జగన్ మోహన్ రెడ్డి) చేసిన అన్యాయాలను ఎత్తి చూపేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నాను. రాయలసీమలోని ప్రతి కుటుంబాన్ని సుభిక్షంగా మార్చాలని కోరుకుంటున్నాను. ఈ పరివర్తనలో నాకు సహాయం చేయడానికి.. యువత వారి ఆలోచనలను నాతో పంచుకోవాలని కోరుతున్నాను’ అని లోకేష్ ట్వీట్ చేశారు. వాట్సాప్ నంబర్, వెబ్‌సైట్, మెయిల్ ఐడీని పోస్టు చేశారు.

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, పన్నుల భారంతో బతుకు భారంగా మారిందని లోకేష్‌కు మహిళలు తమ బాధను చెప్పుకున్నారు. ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుందని యువత ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని మహిళలకు లోకేష్‌ అభయమిచ్చారు.

స్థానికంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువతకు లోకేష్ హామీ ఇచ్చారు.
ఏపీ ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు.. నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. సరిగ్గా 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు.

రాష్ట్రంలో కాలి నడకన తిరిగి క్షేత్రస్థాయి పరిస్థితులను కళ్లారా చూస్తానని లోకేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.

రాష్ట్రంలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంపై లోకేష్ మండిపడ్డారు. ‘‘పెంచుకుంటూ పోతానన్నది పెట్రోలు రేట్లా జగన్?!. రాష్ట్రంలో పెట్రోలు ధరలు జగన్ పాపాల చిట్టా మాదిరిగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదోనిలోని భారత్ పెట్రోలు బంకు వద్ద లీటరు పెట్రోలు ధర రూ.111.31, డీజిల్ ధర రూ.99.09 రూపాయలు కాగా, పొరుగున ఉన్న కర్నాటకతో పోలిస్తే పెట్రోలు 13రూపాయలు, డీజిల్ ధర 10 రూపాయలు అధికం” అంటూ విమర్శించారు.

అధికారంలోకి వచ్చాక ఆకాశమే హద్దుగా రోజురోజుకు పెంచుతూ పోతున్న పెట్రోలు, డీజిల్, నిత్యవసరాలు, ఇంటి పన్నులు, కరెంటు చార్జీలు చూశాక గానీ జలగన్న నిజస్వరూపమేమిటో జనానికి అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ఒక్కఛాన్స్‌తో నిండామునిగిన ఏపీ ప్రజలనోట ఇప్పుడు వస్తున్న మాట “సైకో పోవాలి… సైకిల్ రావాలి!” అంటూ లోకేష్ తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles