వైఎస్ జగన్ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితులలో సహితం చీలనీయనని తరచూ స్పష్టం చేస్తూ టిడిపితో పొత్తుకు సిద్దమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బలహీనుడిని, ఏకాకి చేయడం పట్ల ఇప్పుడు వైసీపీ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. స్వయంగా సీఎం జగన్ `దత్త పుత్రుడు’ అంటూ దుష్ప్రచారం చేస్తున్నా, మంత్రులు `ప్యాకేజి కళ్యాణ్’ అంటూ ఆరోపణలు చేస్తున్నా, వ్యక్తిగతంగా `ముగ్గురు భార్యలు’ అంటూ అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నా పవన్ చలిస్తున్న సూచనలు కనిపించడం లేదు.
దానితో ఇప్పుడు జగన్ కు మద్దతుదారునిగా పేరొందిన వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సొంతపార్టీలోనే పవన్ `వెన్నుపోటు’లు గురవుతున్నదంటూ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. జనసేనకు రాజకీయంగా విధానపరమైన అంశాలలో కీలక పాత్ర వహిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల భాస్కర్ ను `వెన్నుపోటుదారుడు’ అంటూ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ ఏంచేసినా దానిపై వెటకారంగా స్పందిస్తూ జనసేన కార్య కర్తల్లో , మెగా అభిమానుల్లో ఆగ్రహం పెంచుతూ వస్తున్నారు. మొన్నటికి మొన్న వారాహి వాహనం ఫై పవన్ కామెంట్స్ చేయగా..తాజాగా నాదెండ్ల మనోహర్ , చంద్రబాబు లు కలిసి పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడవబోతున్నారని , ఈ విషయాన్నీ రాత్రి కలలో దేవుడు చెప్పాడంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు.
జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత మనోహర్ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరి మధ్య దూరం పెంచితే, జనసేన తనంతట తానే కుప్పకూలిపోతుంది ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తున్నది.
ఆనాడు జూలియస్ సీజర్‌ను బ్రూటస్, ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్‌ని నాదెండ్ల భాస్కర్ రావు, అటు పిమ్మట మళ్లీ ఎన్టీఆర్‌నే నారా చంద్రబాబు నాయుడు ఎలా అయితే వెన్నుపోటు పొడిచారో.. ఇప్పుడు కూడా జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కూడా ఆయన పక్కనే ఉంటున్న నాందెండ్ల మనోహర్, నారా చంద్రబాబు నాయుడు.. ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడుస్తారని జోస్యం చెప్తున్నాడు ఆర్జీవి. ఈ విషయాన్ని తనకు రాత్రి పూట కలలో ఏకంగా దేవుడే కనిపించి చెప్పాడట. ఈ మేరకు వర్మ ట్వీట్ చేశాడు.
ఆర్జీవీ ట్వీట్ల వర్షంపై జనసైనికులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఓసారి దేవుడే లేడని మాట్లాడుతావు.. మళ్లీ ఆ దేవుడే కలలోకి వచ్చి చెప్పాడంటావు.. ఏంది సామీ ఇది.. వొడ్కాలో నీళ్లు తగ్గాయేమో చూసుకో అంటూ నెటిజన్లు తన స్టైల్‌లోనే కౌంటర్లు ఇస్తున్నారు. మరికొందరైతే.. ఓ అడుగు ముందుకేసి బూతుపురాణాలు కూడా చదువుతున్నారు.
ఏదిఏమైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసిపి నేతలను నిద్రకు దూరం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. పవన్ – చంద్రబాబు కలిస్తే తమకు తీవ్ర పరాభావం తప్పదనే భయం వారిని వెంటాడుతున్నది. వారిద్దరిని వేరు చేయడం కోసం, తాజాగా ముందుగా పవన్ ను జనసేనలో ఒంటరివాడిని చేయడం కోసం ఎత్తుగడ వేస్తున్నారు. అయితే ఈ ఎత్తుగడను గ్రహించే నాగబాబు ఆర్జీవీ ఆరోపణలను కొట్టిపారేసారు.