నవంబర్ లోనే తెలంగాణ ఎన్నికలు?

Sunday, December 22, 2024

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నవంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సన్నాహాలను ఎన్నికల కమీషన్ వేగవంతం చేస్తుండటంతో ఈ అభిప్రాయం కలుగుతుంది.  2018లో డిసెంబర్ 7న ఎన్నికలు జరిగి, 11న ఓట్ల లెక్కింపు జరిగాయి. కానీ ఈ సారి కొంచెం ముందుగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లతో పాటు తెలంగాణాలో ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. కీలక స్థానాల్లో ఉన్న రెవెన్యూ, పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల కమీషన్ లేఖలు రాసింది. 

శుక్రవారం   అధికారుల బదిలీ ప్రక్రియపై సర్క్యులర్ జారీ చేసిన ఎన్నికల కమీషన్ శనివారం  మాస్టర్ ట్రైనర్లకు శిక్షణకు సంబంధించిన మరో సర్క్యులర్ ను ఇచ్చింది. మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పని చేస్తున్న అధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.

ఎన్నికలకు సంబంధం ఉండే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌లతో పాటు కింది స్థాయి సిబ్బంది బదిలీలు జులై 31 లోపు పూర్తికానుంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాల్లో పేర్కొంది.

ఇన్స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లకు సొంత జిల్లా లో పోస్టింగ్ ఇవ్వొద్దని సూచించింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో బంధుత్వాలు లేవని వారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నెల 5వ తేదీ నుంచి 10 వ తారీఖు వరకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది.  ఓటర్ల నమోదు ప్రక్రియ నుంచి లెక్కింపు వరకు అనుసరించాల్సిన పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2.99 కోట్ల మంది ఓటర్లున్నారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశం ఉన్నదని అంచనా.  రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 మందికి శిక్షణ ఇస్తారు. వీళ్లు కింది స్థాయి సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. 

ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ఎన్ని ఈవీఎంలు ఉన్నాయి? అందులో ఎన్ని పనిచేస్తున్నాయి. ఇంకా ఎన్ని కావాలి? అనే అంశాలపైనా ఈసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈసీ చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో ఎన్నికలకు ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చనే వాదన బలంగా వినిపిస్తున్నది. అక్టోబర్ చివరి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles