దేశ రాజధాని ఢిల్లీకి చేరిన అమరావతి రైతుల పోరాటం 

Tuesday, November 5, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అంటూ అమరావతి రైతులు మూడేళ్ళుగా సాగిస్తున్న పోరాటం ఇప్పుడు దేశ రాజధానికి చేరింది.  ఒకే రాజధాని కోరుతూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో తమ డిమాండ్లను బలంగా వినిపించారు.

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధరణికోట టూ ఎర్రకోట పేరుతో ప్రత్యేక రైలులో రైలు యాత్ర చేపట్టిన అమరావతి రైతులు శనివారం ఉదయం గం. 10.30కు ఢిల్లీలోని సఫ్తర్‌జంగ్ రైల్వే స్టేషన్ చేరునొకని అమరావతే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంటూ నినాదాలు చేశారు. 

500 మందికి పైగా మహిళా రైతులతో పాటు మొత్తం 1,600 మంది ఢిల్లీ చేరుకోగా, రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కొందరు ధర్నా వేదిక జంతర్ మంతర్ చేరుకోగా, మహిళా రైతులు తమకు ఏర్పాటు చేసిన వసతి గృహాలకు వెళ్లి మధ్యాహ్నం తర్వాత ధర్నా వేదిక చేరుకున్నారు. 

రైతుల ఆందోళనకు మద్ధతు తెలుపుతూ వేదికపైకి చేరుకున్నవారిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), తెలుగుదేశం, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ కిసాన్ సంఘ్ సహా పలువురు రైతు సంఘాల నేతలున్నారు. వేల మంది చిన్న, సన్నకారు రైతుల నుంచి భూమిని సేకరించి రాజధాని నిర్మించకపోవడాన్ని నేతలు తప్పుబట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వారంతా నినదించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఢిల్లీలో మూడు రోజుల నిరసనలకు పిలుపునిచ్చిన రైతులు. తొలిరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించగా, ఆదివారం కేంద్ర పెద్దల్ని కలిసి అమరావతి సమస్యను వివరిస్తున్నారు. మూడో రోజు సోమవారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో వారు బహిరంగ సభ నిర్విహంచబోతున్నారు.

 ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ఆయా పార్టీల నేతలను అమరావతి నేతలు కలిసి మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరిస్తున్నారు. అలాగే ఈనెల 19న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరగనున్న భారతీయ కిసాన్ సంఘ్ ర్యాలీలో పాల్గొని అమరావతి రాజధాని వాణిని వినిపిస్తామని ఎపి రైతులు వెల్లడించారు.

మరోవంక, రాజధానిగా అమరావతిని మాత్రమే ఉంచాలని కోరుతూ వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు అమరావతి జేఏసీ నేతలు లేఖలు రాశారు.

అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుతూ మూడేళ్లుగా ఇక్కడి రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, ఇందులో 200 మంది రైతులు చనిపోయారని ప్రధాని, రాష్ట్రపతి, అమిత్ షాకు రాసిన లేఖల్లో జేఏసీ పేర్కొంది. అలాగే అమరావతి ఉద్యమంపై ఇప్పటివరకూ వైసీపీ సర్కార్ 1100 దాడులు చేయించిందని అందులో పేర్కొన్నారు. 

కాబట్టి ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకుని అమరావతిలోనే రాజధాని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు కోరారు. తద్వారా వేలాది ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles