దామోదర రాజనర్సింహ సహితం తన దారి చూసుకొంటున్నారా!

Saturday, January 18, 2025

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన కావించేందుకంటూ ఏఐసీసీ ప్రకటించిన జంబో కమిటీలు ఆ పార్టీలో ప్రకంపనలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ తనను కేవలం కార్యవర్గ సభ్యురాలిగా వేసి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, తనకు పదవులు అక్కర్లేదంటూ ఆ పదవికి రాజీనామా చేశారు. 

ఆమె మార్గంలోనే,  పీసీసీ సీనియర్‌ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్‌ తన పదవికి రాజీనామా చేశారు. తనకు కొత్త కమిటీల్లో చోటుకల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.అంకితభావంతో పార్టీకి సేవచేస్తున్నవారిని కాదని కొత్తగా చేరిన వారికి, జూనియర్లకు ప్రధాన కమిటీల్లో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తాజాగా, కమిటీల కూర్పుపై ఏపీ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ నిరసన గళం వ్యక్తం చేశారు. 

జంబో టీమ్‌తో బీజేపీ, టీఆర్ఎస్‌లను తెలంగాణాలో సమర్ధవంతంగా ఎదుర్కొంటామని అనుకుంటే సొంత పార్టీ నేతలనే లక్ష్యం చేసుకొని ఒకొక్కరు అసమ్మతి వ్యక్తం చేస్తుండటం  ఆ పార్టీ వర్గాలలో ఆందోళన కలిగిస్తున్నది. చాలాకాలం, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ వస్తున్న 

దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా చేసిన వాఖ్యలు అసలు పార్టీలో ఏమి జరుగుతుందో అనే అనుమానాలకు దారితీస్తుంది. ఎవ్వరికీ వారు తమ రాజకీయ భవిష్యత్తుకై సొంత దారి ఎంచుకొనే మార్గంలో ఉన్నారా? అని చాలామంది భావిస్తున్నారు. 

కాంగ్రెస్ లో కోవర్థులు రాజ్యమేలుతున్నారని ఆరోపిస్తూ, పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు రావడం లేదని, పీసీసీ ప్రకటించిన లిస్టు చూశాక కాంగ్రెస్‌లో ఏదో జరుగుతోందని అనిపిస్తోందని రాజనరసింహ ధ్వజమెత్తారు. మూడు నెలల కిందట కాంగ్రెస్‌లోకి వచ్చిన వాళ్ళకి, పార్టీ చరిత్ర తెలియని వాళ్లకి పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గత ఎనిమిది సంవత్సరాలుగా పార్టీలో కోవర్టిజం అనే రోగం మొదలైందని ఆరోపించారు.

 అయితే, తాను పుట్టింది కాంగ్రెస్ పార్టీలోనని.. పార్టీ మారుతాననే ప్రచారంలో వాస్తవం లేదని దామోదర రాజ నర్సింహ స్పష్టం చేశారు. కొండా సురేఖ సహితం కాంగ్రెస్ ను వదిలే ప్రసక్తి లేదన్నారు. ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత శశిధర్ రెడ్డి సైతం కాంగ్రెస్‌ను వీడబోనని చెబుతూనే పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం గమనార్హం. 

టీఆర్ఎస్ ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఒక నిందితుడు రాజనరసింహాను  కలసినట్లు మీడియాలో రావడం ఈ సందర్భంగా గమనార్హం. ఆ కథనాలను ఆయన కొట్టిపారవేసిన్నప్పటికీ, ఆయనను తమ పార్టీలో చేర్చుకోవాలని కొంతకాలంగా బీజేపీ ప్రముఖులు కొందరు ప్రయత్నం చేస్తున్నారు.  ఏదేమైనా కాంగ్రెస్‌లో టీపీసీసీ కొత్త కమిటీల కూర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్న నేతల జాబితా రోజురోజుకు పెరిగి పోతున్నది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles