తెలంగాణాలో కాంగ్రెస్ ను మంచి జోష్ లోకి తీసుకు రావడంలో, బిజెపిని పక్కకు నెట్టి అధికార బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థితికి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పుడు హైదరాబాద్ కు దూరమైన్నట్లు తెలుస్తున్నది.
ఆదివారం జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంపై ఆయన రాకపోవడం, కొద్దీ రోజులుగా హైదరాబాద్ కు రాకుండా బెంగుళూరుకు పరిమితం అవుతూ ఉండడంతో ఆయన తెలంగాణ ఎన్నికల వ్యవహారంకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది. దానితో పలువురు కాంగ్రెస్ నాయకులు కలవరం చెందుతున్నారు.
ఆయన క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్రమైన నివేదికలు ఇస్తూ ఉండటమే కాకూండా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమలో విబేధాలను మరచి, ఎన్నికల ముందు ఒకటిగా పనిచేసే వాతావరణం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. ప్రతి నియోజకవర్గంలో తన బృందంతో అన్ని పార్టీల పరిస్థితుల గురించి సర్వేలు చేయించి, పార్టీ బలోపేతంకోసం ఇతర పార్టీల నుండి ఏయే నాయకులను ఆకర్షించాలనే సూచనలు కూడా చేశారు.
ఇప్పటివరకు కనుగోలు మార్గదర్శనలో నడుస్తూ తెలంగాణ కాంగ్రెస్ అందరికి ఆశ్చర్యపోయే విధంగా పూనుకొంటుంది. అయితే అకస్మాత్తుగా ఆయన దూరం కావడం విస్మయం కలిగిస్తున్నది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఏర్పడిన విభేదాలే అందుకు కారణంగా చెబుతున్నారు. ఇటీవల అమెరికాలో ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వాఖ్యాలను బిఆర్ఎస్ నేతలు రాజకీయ ఆయుధంగా చేసుకొని, ప్రజలలోకి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చొచ్చుకు పోగలిగారు.
ఈ విషయంలో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ బిఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోలేకపోయింది. కనీసం సోషల్ మీడియా బృందం అయినా బిఆర్ఎస్ ను కడిగిపారవేసే విధంగా ప్రచారం చేపట్టి ఉండాల్సింది అంటూ రేవంత్ రెడ్డి తన అసంతృప్తిని సునీల్ కనుగోలు వద్ద వ్యక్తం చేసారని, దానితో ఆయన మనస్ధాపంకు గురయ్యారని చెబుతున్నారు.
పైగా, పార్టీ వ్యూహాలను రూపొందించడంలో రేవంత్ జోక్యం ఎక్కువ కావడం పట్ల కూడా సునీల్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తనకు అనుకూలంగా ఉన్న నేతలకు సానుకూల నివేదికలు ఇవ్వమని వత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది. రేవంత్ ఎవ్వరితో కొన్ని వ్యూహాత్మక అంశాలపై తనకు తానే ప్రకటనలు చెందటం పట్ల కూడా పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఆయన సారధ్యంలో తెలంగాణాలో సహితం ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని ధీమా కాంగ్రెస్ నేతలలో ఏర్పడుతున్న సమయంలో ఒక విధంగా ఝలక్ ఇచ్చిన్నట్లయింది. సీనియర్ నాయకులు సహితం సునీల్ ను కలసి తమ తమ నియోజకవర్గాలలోని పరిస్థితులను అడిగి తెలుసుకొంటూ, ఏవిధంగా మెరుగు పరచుకోవాలో సూచనలు తీసుకొంటున్నారు.
స్థానిక కాంగ్రెస్ నేతలు ఎవ్వరికీ చెప్పకుండా సునీల్ బెంగుళూరుకు వెళ్లిపోయారని, ఫోనులకు కూడా స్పందించడం లేదని తెలుస్తోంది.అయితే, సునీల్ సేవలు తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ లలో ఎక్కువగా అవసరమని ఏఐసీసీ భావిస్తున్నదని, ఆయన దృష్టి ఎక్కువగా అటువైపు కేంద్రీకరిస్తూ ఉండడంతో తెలంగాణకు తగు సమయం కేటాయింపలేక పోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్ త్వరలో తెలంగాణ వార్ రూమ్ ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు భావిస్తున్నారు.