వైఎస్ భారతి, సజ్జల పేర్లను తెరపైకి తెచ్చిన డా. సునీత

Saturday, May 4, 2024

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా సీబీఐ కోర్టుకు సమర్పించిన అదనపు ఛార్జ్ షీట్ లో పేర్కొన్న వాంగ్మూలాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభ సభ్యుల పేర్లను తెరపైకి తీసుకురావడంతో రాజకీయంగా కలకలం రేగుతుంది. 

ఆయన సోదరి వైఎస్ షర్మిల ఇచ్చిన వాంగ్మూలంలో హత్యకు ఆర్థిక పరమైన లావాదేవీలు, కుటుంబ పరమైన సమస్యలు ఏవీ కారణం కాదని, రాజకీయ అంశాలే అంటూ స్పష్టం చేసినట్లయింది. పైగా, కడప ఎంపీ సీటు విషయంలో తలెత్తిన వివాదాలే కారణంగా భావిస్తున్నట్లు ఆమె తేల్చి చెప్పారు. 

మరోవంక, వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీత రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో నేరుగా ముఖ్యమంత్రి శ్రీమతి వైఎస్ భారతి పేరును తెరపైకి తీసుకొచ్చారు. భారతితో పాటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేరును కూడా ఆమె ప్రస్తావించడం సంచలనం రేపుతోంది.  అంతేకాకుండా, వైఎస్ భారతి, సజ్జల మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను ఆమె సీబీఐకి సమర్పించారు.

ఈ వాంగ్మూలం మీడియాలో రాగానే వివేకానంద రెడ్డి హత్యకు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ భారత్ కూడా బాధ్యత వహించాలి అన్నట్లుగా మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఆరోపించడం గమనార్హం. దానితో వివేకా హత్యకేసు రాజకీయంగా నూతన మలుపులు తిరిగే అవకాశాలు స్పష్టం అవుతున్నాయి.

తన ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి తనకు ఫోన్ చేశారని, తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్లకు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని సునీత తెలిపారు. ఎక్కువ సమయం తీసుకోనని చెప్పిన భారతి వెంటనే తన ఇంటికి వచ్చారని, అయితే ఆమెతో పాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో తాను ఆశ్చర్యపోయానని ఆమె చెప్పారు. 

లిఫ్ట్ వద్దే భారతితో తాను మాట్లాడానని, ఆ సమయంలో భారతి చాలా ఆందోళనగా కనిపించారని డా. సునీత చెప్పారు. నాన్న చనిపోయిన తర్వాత తొలిసారి ఇంటికి వచ్చినందున భారతి బాధగా ఉన్నారని తాను అనుకున్నానని సునీత చెప్పారు. అయితే, ఇకపై ఏం చేసినా సజ్జలతో టచ్ లో ఉండాలని తనతో భారతి చెప్పారని సునీత వెల్లడించారు.

 హత్య గురించి మీడియాతో మాట్లాడాలని సజ్జల తనతో చెప్పారని, ఆయన ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని చెప్పారు. గది శుభ్రం చేసేటప్పుడు అక్కడున్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియోను పంపించానని తెలిపారు. 

అయితే, వీడియో పంపించడం కాదు, ఈ వివాదానికి ముగింపు పలికేలా ప్రెస్ మీట్ పెట్టాలని సజ్జల చెప్పారని, జగనన్నతో పాటు అవినాశ్ పేరును కూడా ప్రస్తావించాలని సలహా ఇచ్చారని చెప్పారు. అప్పటి వరకు తాను ఎక్కడా అవినాశ్ పేరును ప్రస్తావించలేదని, అవినాశ్ పేరును ప్రస్తావించాలని చెప్పినప్పుడు కొంత సంకోచించానని సునీత తెలిపారు.

కడప ఎంపీ అభ్యర్థిత్వాన్ని తన తండ్రి కోరుకోలేదని సునీత ఈ సందర్భంగా స్పష్టం చేయడం గమనార్హం. పైగా, అవినాష్ రెడ్డి కుటుంభంకు, తమ కుటుంభంకు మధ్య దశాబ్దాలుగా విబేధాలు ఉన్నాయని ఆమె సీబీఐకు తెలిపారు. సజ్జల సలహా మేరకే హైదరాబాదులో తాను ప్రెస్ మీట్ పెట్టానని కూడా చెప్పారు. 

గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని తొలి నుంచి అడుగుతున్నానని ఆమె స్పష్టం చేశారు. జగనన్నను సీఎంగా చూడాలని నాన్న చాలా కష్టపడ్డారని, ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని ఆమె చెప్పారు. పొరపాటు జరిగిందనే విషయం తనకు తెలుసని చెబుతూ క్రిమినల్ మైండ్ ఎలా పని చేస్తుందో మాత్రం అర్థం చేసుకోలేదని ఆమె పేర్కొన్నారు.

మార్చురీ బయట ఉన్నప్పుడు ఒక ఫిర్యాదును రాసుకొచ్చి సంతకం చేయమన్నారని సునీత తెలిపారు. ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర టిడిపి నేతలపై ఆరోపణలు ఉన్నాయని డా. సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని, టిడిపి నేతలే ఈ నేరానికి పాల్పడ్డారని అవినాశ్ తనతో అన్నారని ఆమె చెప్పారు. అయితే ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని ఆమె వెల్లడించారు.

2019 జులైలోనే అవినాశ్ పై తనకు అనుమానం మొదలయిందని సునీత తెలిపారు. వివేకా మృతి విషయం తన కుమారుడికి ముందే తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని, అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి తనకు అనుమానం వచ్చిందని ఆమె చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles