ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గద్దె దింపగలిగింది తామే అంటూ ఒక వంక కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా, వారి ఎత్తుగడలను వ్యూహాత్మకంగా తిప్పికొడుతూ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ తనదైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.
అయితే, అనూహ్యంగా గత ఏడాది చివరిలో ఖమ్మంలో భారీ బహిరంగసభ జరపడం ద్వారా తెలంగాణాలో తమ ఉనికిని ఎవ్వరూ నిర్లక్ష్యం చేయలేరనే బలమైన సంకేతాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చారు. పైగా, పార్టీకి దూరమైన నేతలంతా తిరిగి రావాలని పిలుపిచ్చారు. తెలంగాణ పార్టీ అధ్యక్షునిగా ప్రముఖ బిసి నేత
కాసాని జ్జానేశ్వర్ ముదిరాజ్ ను నియమించినప్పటి నుండి తెలంగాణాలో టిడిపి తిరిగి ఉనికి పుంజుకోవడం ప్రారంభమైంది. దాదాపు ప్రతివారం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమవుతూ చంద్రబాబునాయుడు వారికి మార్గదర్శకం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో తిరిగి టిడిపి పుంజు కొనే విధంగా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటులో టిడిపి నిర్ణయాత్మక పాత్ర వహించేటట్లు చేసేందుకు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే ‘ఇంటింటికి తెలుగు దేశం’ కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. టిడిపి పుట్టిందే తెలంగాణాలో అంటూ ఇక్కడ నెలకొన్న బానిసత్వ వ్యవస్థ నుండి పేద ప్రజలకు విముక్తి కలిగించిన ఘనత కూడా తమదే అంటూ ప్రచారం ప్రారంభించారు.
తెలంగాణాలో టీడీపీకి చెందిన బలమైన నాయకులు చాలావరకు ఇతర పార్టీలకు వలసవెళ్లిన్నప్పటికీ ఇప్పటికే ప్రతి జిల్లాలో ఆ పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. కనీసం 40 నియోజకవర్గాలలో గెలుపోటములను నిర్ణయించే సత్తా ఆ పార్టీకి ఉందని పలు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటువంటి సమయంలో, టీడీపీ 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈనెల 29న సభ నిర్వహణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఎన్నికలకు సమాయత్తం కావాలని భావిస్తున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల నుంచి 15 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు కాసాని వెల్లడించారు. తెలంగాణలో అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణలుు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులతో టీడీపీ ఓ కార్యక్రమం జరుపుతుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన సందేశం ఇస్తారని భావిస్తున్నారు.
ఈ విధంగా టీడీపీ తెలంగాణాలో తన ఉనికి చాటుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుండటం అన్ని పార్టీలలో కలకలం రేపుతోంది. తమ మద్దతుపై ప్రభావం చూపుతుందని ఒకవంక బిఆర్ఎస్, మరోవంక బిజెపి, కాంగ్రెస్ కూడా ఆందోళన చెందుతున్నాయి.