తాడేపల్లి ప్యాలెస్ వైపుకు వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు!

Sunday, December 22, 2024

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో ఇదంతా అప్పట్లో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు చేయించారని అంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, రాష్ట్ర పోలీసుపై నమ్మకం లేదని, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ దర్యాప్తుకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, రాష్ట్ర పోలీసుల దర్యాప్తును సహితం నీరుకారుస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరకు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులనే బెదిరిస్తూ, వారిపైననే ఎదురు కేసులు నమోదు చేసే వరకు వెళ్లారు. దానితో, చిన్నాన్న కుమార్తె, వరుసకు చెల్లెలు డా. సునీత సుప్రీంకోర్టు వరకు వెళ్లి, సిబిఐ కేసును ఏపీ నుండి తెలంగాణకు మార్చేటట్లు చేయడంతో ఇప్పుడు సరికొత్త పాత్రధారులు రంగంపైకి వస్తున్నారు.

మొదటిసారిగా కడప ఎంపీ, జగన్ మరో చిన్నాన్న కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచినా సిబిఐ ఆయన నుండి కీలకమైన సమాచారం సేకరించింది. ఈ సందర్భంగా సిబిఐ దర్యాప్తు తాడేపల్లిలో జగన్ అధికార నివాసం వైపు మళ్లింది. ఇప్పుడు అక్కడివారికి సిబిఐ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతున్నది.

హత్యజరిగిన సమయంలో, ఆ తర్వాత అవినాష్ ఎక్కువగా రెండు ఫోన్ నంబర్లతో మాట్లాడినట్లు గుర్తించిన సిబిఐ అధికారులు, ఆ నంబర్లు ఎవరివని అవినాష్ ను విచారించారు. ఈ సందర్భంగా అవి తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధించినట్లు వెల్లడైంది.

 నంబర్లను తీసుకొని విచారిస్తే, వాటిల్లో ఒక్క నంబర్ నవీన్ అనే వ్యక్తిదని తేలింది. అతను తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటాడని, షర్మిలతో మాట్లాడాలి అనుకొంటే, ఆ నంబర్ కు ఫోన్ చేస్తుంటామని అవినాష్ ద్వారా సీబీఐకి తెలిసింది. దానితో అతనికి నోటీసులు జారీచేశారు. వాటిల్లో ఒక నంబర్ నవీన్ అనే వ్యక్తిది అని, వైఎస్ షర్మిలతో మాట్లాడాలి అంటే ఆ నంబర్ కు ఫోన్ చేస్తుంటామని అవినాష్ ద్వారా సిబిఐ తెలుసుకుంది. ఇక, సీఎం జగన్ తో మాట్లాడాలంటే మరో నంబర్ గల వ్యక్తికి ఫోన్ చేస్తామని చెప్పారు.

దానితో ఇప్పుడు నవీన్ ఎవరనే ఆసక్తి కలుగుతుంది. నవీన్‌ కుటుంబం పులివెందులలోని రాజారెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి దగ్గర వీరి కుటుంబం పని చేసేది. ఆ తర్వాత నవీన్‌ అలియాస్ హరిప్రసాద్, జగన్ దగ్గర పనిచేసేవారు.రాజారెడ్డి కాలంలో హరిప్రసాద్‌ అలియాస్ గోపరాజు నవీన్ కుటుంబీకులు దోబీ పని చేసేవారని గ్రామస్తులు చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం ఇప్పట్ల గ్రామానికి చెందిన నవీన్ దాదాపు 15ఏళ్లుగా జగన్ దగ్గర పనిచేస్తున్నారు.

జగన్‌తో పాటు బెంగళూరు, హైదరాబాద్‌లో లోటస్‌ పాండ్‌లో ఆయన దగ్గర పని చేశారు. 2018 చివరిలో జగన్‌ కుటుంబం తాడేపల్లికి మకాం మారినప్పుడు వారితో పాటు ఇక్కడికి చేరుకున్నారు. దాదాపు 15 ఏళ్లుగా వారితోనే ఉంటున్నారు. జగన్‌ సతీమణి భారతికి వ్యక్తిగత సహాయకుడిగా ఇంటి పనులన్నీ చేసి పెడుతుంటారని సన్నిహితులు చెబుతున్నారు. ఇంటి పనులు చేసిపెట్టడంతో పాటు అన్ని వేళలా అందుబాటులో ఉండటంతో అత్యవసర సమయాల్లో దగ్గరి బంధువులు అతనికే ఫోన్ చేసి సంప్రదిస్తుంటారని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి వివేకా హత్య జరిగిన తర్వాత తెల్లవారు జామున తాడేపల్లిలో ఉండే నవీన్‌కు అవినాష్‌రెడ్డి పలుమార్లు ఫోన్‌ చేసినట్లు కాల్‌డేటా ఆధారంగా సీబీఐ గుర్తించింది. దీంతో నవీన్ ఎవరనే దానిపై సీబీఐ దృష్టి సారించింది. అతని మొదటి పేరు హరిప్రసాద్‌ కాగా… నవీన్‌గా పేరు మార్చుకున్నట్లు గుర్తించారు.

సీబీఐ అధికారులు సోమవారం పులివెందులలో హరి ప్రసాద్‌ ఎవరని ఆరా తీశారు. వివేకా హత్య తర్వాత తాడేపల్లిలోని ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేందుకు నేరుగా వారి ఫోన్‌ నంబర్లను సంప్రదించకుండా నవీన్ నంబరుతో ఎందుకు మాట్లాడారని సిబిఐ విచారిస్తోంది.

మరోవైపు నవీన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసంలో పదిహేనేళ్ళుగా పనిచేస్తున్నాడని, ముఖ్యమంత్రి సతీమణి భారతితో తాను మాట్లాడాలన్నా ఇతర నంబర్లు అందుబాటులోకి రాకపోతే నవీన్‌కు ఫోన్ చేస్తానని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నవీన్‌కు సిబిఐ నోటీసులు ఇవ్వడంపై స్పందించిన సుబ్బారెడ్డి, నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతాడని అందులో తప్పేముందని చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles