తాడేపల్లి కర్మాగారంలో ట్విట్ల తయారీ… రఘురామ ఎద్దేవా!

Saturday, January 18, 2025

టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనని లక్ష్యంగా చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అరడజన్ మంది నాయకులు, నాయకురాళ్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారని వైసిపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి వెనక ఉండి ఈ విమర్శలు చేయిస్తున్నారని చెబుతూ ఈ ట్విట్లు  అన్ని `తాడేపల్లి కర్మాగారం’లో (సీఎం  అధికార నివాసం) తయారవుతున్నాయని వెల్లడించారు. 

అయితే ఈ ట్వీట్లు ఇస్తున్నవారెవ్వరు వాటిని వ్రాయడం కానీ, కనీసం చదవడం కానీ చేసి ఉండరని చెప్పారు. ఉదాహరణకు,  ఎంపీ అయోధ్య రామిరెడ్డి మంచి వ్యాపారవేత్త. కానీ ఆయనకు తెలుగు కవిత్వం రాదు. సమాజంలో మంచి వ్యాపారవేత్తగా పేరుంది. తనపై ట్విట్టర్లో రాజు, కాజు, మోజు, రివాజు అని యతిప్రాసలతో కవిత్వాన్ని సంధించారని గుర్తు చేశారు. 

ట్విట్టర్లో ఆయన పేరిట తాడేపల్లి ప్యాలెస్ లో పనిచేసే జివిడి కృష్ణమోహన్ ఈ కవితను రాశారని నర్సాపురం ఎంపీ ఆరోపించారు. అదేవిధంగా మాజీ హోంమంత్రి సుచరిత అంటే తనకు గౌరవం ఉందని అంటూ ట్విట్టర్లో ఆమె తనపై చేసిన పోస్ట్ ముందు కనీసం చదివిందో లేదో… తానైన ఇప్పుడు చదివి వినిపిస్తానని చెప్పారు. 

తన పబ్లిసిటీ ద్వారానైనా ట్విట్టర్లో ఆమెకు మరో వెయ్యి మంది ఫాలోవర్స్ పెరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ తనపై విమర్శలు చేసినంత మాత్రాన సుచరిత అంటే తనకు ఇసుమంతైన గౌరవం తగ్గలేదని స్పష్టం చేశారు. మరోవంక, తన సహచర ఎంపీ మాధవి అంటే తనకెంతో అభిమానం అని చెప్పారు. తన కూతురు కంటే తక్కువ వయసు ఆమెదని తెలిపారు. 

ఆమెను తానే స్పీకర్ కు పరిచయం చేశానని చెబుతూ  రెండు స్థానాల్లో … 200 స్థానాల్లో అంటూ ప్రాస కోసం రాసిన ట్విట్ ను భవిష్యత్తులో సరి చేసుకోవాలని ఆయన హితవు చెప్పారు.  ఎందుకంటే రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయని గుర్తు చేశారు.  హోంమంత్రి తానేటి వనిత తమ జిల్లాకు చెందిన వ్యక్తి. తాడేపల్లి ప్యాలెస్ లో వండిన ట్విట్ ను, ఆమె కూడా పోస్ట్ చేశారని తెలిపారు. 

భవిష్యత్ ముఖచిత్రం తమ పార్టీ పెద్దలకు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే తనపై ఇంతమంది చేత ట్విట్టర్ వేదికగా దాడి చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. తానేటి వనిత కూడా హిట్ లిస్ట్ (జగన్ లిస్ట్)లో ఉన్నట్లు తెలిసిందని హెచ్చరించారు. అయితే, మళ్లీ ఆమెకు టికెట్ రావాలని, ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

హోం మంత్రిగా ఎవరో రాసిన ట్విట్ల ను పోస్ట్ చేయడం సరికాదని హితవు చెప్పారు. తన ట్విట్టర్ హ్యాండిల్ ను తానే ఉపయోగించుకోవాలని సూచిస్తూ తనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసినంత మాత్రాన ఆమెపై తనకున్న గౌరవం రవ్వంత కూడా తగ్గదని భరోసా ఇచ్చారు. 

 ట్విట్టర్లో తనపై తమ పార్టీ నాయకులు చేసిన విమర్శలు గాడిద రాశారో… గురుజాడ రాశారో తెలియదని చెప్పారు.  బాపట్ల ఎంపీ కూడా కవితాత్మకంగా విమర్శలు సంధించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. వీళ్ళందరి తెలుగు భాషా ప్రావీణ్యం ఏ పాటిదో ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. 
తాను ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గ ప్రజలను, నాయకులను అత్యంత గౌరవిస్తానని తెలిపారు. తమ ముఖ్యమంత్రి మాదిరిగా మాటలలో కాదని… చేతల ద్వారా గౌరవిస్తానని వెల్లడించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధుల చేత తనపై విమర్శలు చేయించారని, అయినా వారంటే తనకు ఎంతో గౌరవం ఉందని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles