కేసీఆర్ ను ఇరకాటంలో నెట్టేస్తున్న పొంగులేటి!

Friday, April 26, 2024

తాను పార్టీ మారడం లేదని అంటూనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గల మూడు జనరల్‌ స్థానాలలో ప్రజల అభీష్టం మేరకు కచ్చితంగా ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని ఖమ్మం మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడం చూస్తే ఒక విధంగా నేరుగా సీఎం కేసీఆర్ కే హెచ్చరిక సందేశం పంపినట్లు కనిపిస్తున్నది. 

గత ఎన్నికలలో తనను కాదని టిడిపి నుండి వచ్చిన నామా  నాగేశ్వరరావుకు ఖమ్మం సైట్ వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్థికంగా, అనుచరగణం ఎక్కువగా ఉన్న పొంగులేటిని తమ పార్టీలో తీసుకొచ్చేందుకు బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

అయితే తాను పార్టీ మారడం లేదని ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తున్న   పొంగులేటి ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించడం గమనార్హం.  పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, ఆయన నియోజకవర్గంపై తన పట్టును వదులుకోవడం లేదు. నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. దానితో ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా బలమైన అభ్యర్థి కాగలరనడంలో సందేహం లేదు. 

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పాలేరు నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించడం వెనుక శ్రీనివాస్ రెడ్డి మద్దతు ఉన్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఆయన అండదండలతోనే అక్కడి నుండి సునాయానంగా గెలుపొందగలనని ఆమె ధీమాగా ఉన్నట్లు తెలుస్తున్నది. 

ఇటువంటి తరుణంలో తాను ఇంకా బిఆర్ఎస్ లో ఉన్నట్లే చెబుతూ,  పార్టీ ఆదేశం మేరకు అని కాకుండా `ప్రజాభీష్టం’ మేరకు పోటీ చేస్తానని ప్రకటించడం కలకలం రేపుతోంది. పైగా, ఖమ్మం, కొత్తగూడెం, పాలేరులోని ఏదో స్థానం నుంచి పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవి మూడే  జనరల్ సీట్లు కావడం గమనార్హం. 

పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు లేదా వామపక్షాలు, ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ బరిలో ఉండటంతో.. ఆయనకు మిగిలింది కొత్తగూడెం ఒక్కటేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు, జిల్లా మంత్రి అజయ్ తో కూడా మంచి సంబంధాలు లేకపోవడంతో కొత్తగూడెం సీట్ రావడం సాధ్యం కాకపోవచ్చని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

తనకు సీటు ఇవ్వరని తెలిసే, పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టడం కోసమే, అధికార పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించేందుకు తాను పార్టీ మారడం లేదని  చెబుతున్నాడని అభిప్రాయం కలుగుతుంది. ఏదేమైనా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన శ్రీనివాసరెడ్డిని వదులుకోవడం అధికార పక్షానికి ఆత్మహత్య సాదృశ్యం కాగలదు. 

మరోవంక, పొంగులేటి మద్దతు లేకుండా పాలేరు నుండి వై ఎస్ షర్మిల గెలుపొందడం సహితం సాధ్యం కాదు. వేరే పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ, పాలేరులో షర్మిలకు మద్దతు ఇస్తారా? లేదా చివరకు షర్మిల పార్టీ అభ్యర్థిగానే పోటీ చేస్తారా? లేదా బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి,  షర్మిలకు అక్కడ మద్దతు ఇస్తారా? ఇవ్వన్నీ ప్రస్తుతంకు చిక్కు ప్రశ్నలే. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles